రోగి చెంతకే తరలి వచ్చే ఆసుపత్రుల్లాంటి 104 వాహనాలకు సుస్తీ చేసింది. గతంలో 104 ద్వారా 52 రకాలకు పైగా మందులు అందిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 42కు తగ్గింది. అవి కూడా పూర్తిస్థాయిలో అందని దుస్థితి. నెలవారీ మరమ్మతులకు నోచుకోక, సక్రమంగా డీజిల్ అందక ఆ వాహనాలు
మూలకు చేరుతున్నాయి.
మండపేట : పేదల చెంతకే వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 మార్చిలో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయాలన్నది ఈ పథకం లక్ష్యం. తొలినాళ్లలో మారుమూల ప్రాంతాల వారికి సైతం మెరుగైన వైద్యసేవలందించిన 104 వాహనాలకు వైఎస్ మరణానంతరం ఒడిదుడుకులు మొదలయ్యాయి. మందుల కొరత, అరకొర నిధుల కేటాయింపులతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించలేక మూలకు చేరుతున్నాయి.
నిర్ణీత షెడ్యూల్‌లో గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి బీపీ, చక్కెర, ఉబ్బసం, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు జ్వరం, విరేచనాలు తదితర సాధారణ వ్యాధులకు రోగులకు వైద్యసేవలు అందించి నెలకు సరిపడగా మందులను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఆ వ్యాధులకు సంబంధించి గతంలో సుమారు 52 రకాల మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 42 రకాలు మాత్రమే వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అవి కూడా పూర్తిస్థాయిలో సరఫరా జరగడం లేదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీకి సంబంధించి మెట్‌ఫార్మిన్, గ్లమింగ్ క్లమైడ్ రకాలకు ప్రస్తుతం మెట్‌ఫార్మిన్ మాత్రమే అందిస్తూ మిగిలిన రకాన్ని బయట కొనుగోలు చేసుకోమంటున్నారు.
డీజిల్ లేదు.. మరమ్మతులు లేవు..
జిల్లావ్యాప్తంగా 26 వాహనాలకు డీజిల్ కొరత, మరమ్మతుల కారణంగా ఏడు వాహనాలు సుమారు నెల రోజులుగా మూలకు చేరాయి. మండపేట, సామర్లకోట, అనపర్తి, పెద్దాపురంలలోని 104 వాహనాలు డీజిల్ లేక నిలిచిపోగా మరమ్మతులకు నోచుకోక జగ్గంపేట, పిఠాపురం, చింతూరు వాహనాలు నిలిచిపోయాయి. గతంలో నెల రోజులకు ఒకసారి సాధారణ మరమ్మతులు నిర్వహిస్తే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ వాహనాల ద్వారా సేవలు పొందే రోగులు పేదవర్గాలకు చెందిన వారే కావడం వలన మందులను బయట మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తిస్థాయిలో 104 సేవలందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‘కదిలొచ్చే ఆస్పత్రి’ ఖాయిలా
Published Wed, Aug 12 2015 2:03 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement