చర్చకు అడ్డుపడితే.. విభజనకు అనుకూలమన్నట్లే!
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్న పార్టీలు, ప్రజాప్రతినిధులు విభజనకు అనుకూలంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. బుధవారం ఏపీఎన్జీవో భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు వచ్చి ఇన్ని రోజు లైనా చర్చకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. బిల్లుపై చర్చించకుండా వెనక్కు పంపితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, జరగబోయే నష్టానికి ఆయా పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని చెప్పేలా ఆయా పార్టీలను కలసి కోరతామని తెలిపారు. చర్చను అడ్డుకుంటున్న ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఉద్యోగులపరంగా తమ కార్యాచరణ రూపకల్పన కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిల్లుపై సమగ్రంగా చర్చించి అవసరమైతే ఓటింగ్ నిర్వహించాలని సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు.