సాక్షి, విశాఖపట్నం: ‘గెలిపించడం..ఓడించడం ప్రజల చేతుల్లో ఉంది. ఒకసారి గెలుస్తాం.. మరోసారి ఓడిపోతాం.. అంతిమ నిర్ణేతలు ప్రజలే’ అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ‘గడిచిన ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించిన తనకు ఓడించే సత్తా కూడా ఉంది’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమను ఓడించే సత్తా పవన్‌కు ఉంటే ఉండొచ్చు కానీ, అంతిమంగా, గెలిపించేది ఓడించేది మాత్రం ప్రజలేనన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ... పనిచేస్తున్నారో లేదో ప్రజలను అడిగితే తెలుస్తుందని, ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ తమకు అవసరం లేదన్నారు. స్థానిక గేట్‌వే హోటల్లో వరల్డ్ బర్డ్ స్ట్రైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విమాన ప్రమాదాల నియంత్రణపై దక్షిణాసియా ప్రథమ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
విమానయానంలో మూడో స్థానం
తొలుత వర్క్‌షాపులో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ భారత విమానయాన సంస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. విమానాశ్రయాల్లో తరచూ ప్రమాదాలు జరిగి ధన, ప్రాణ నష్టాలు తప్పడం లేదన్నారు. విమానాశ్రయాల భద్రత కేవలం ప్రభుత్వాలదే కాదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. భోగాపురం విమానాశ్రయానికి ఇంకా 250 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment