
యంగ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఛలో సినిమా విజయం తర్వాత నాగశౌర్యకు మళ్లీ హిట్ అందుకోవడమే గగనమైపోయింది. ఓ బేబీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ హీరోయిన్ సమంత అకౌంట్‌లో పడిపోయింది. దీంతో మళ్లీ విజయాన్ని అందుకునేందుకు పరుగు మొదలుపెట్టాడీ యంగ్ హీరో. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా రాసుకున్న కథే ‘అశ్వథ్థామ’.
నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నిన్నే నిన్నే.. ఎదలో నిన్నే.. చెలియా నీకై నే వేచానులే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను అర్మన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించారు. ఈ పాట అతని అభిమానులతో పాటు ప్రేమికులను అలరిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది.