
రోజూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే బదులు వారానికి ఒకసారి కలుసుకుని హ్యాపీగా ఉందాం.. సంసారం ఒక చదరంగం సినిమాలో ఈ మాట నా మనసుకు కనెక్ట్ అయిందంటోంది హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పురి. నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు. పెళ్లవగానే కొడుకు, కోడలు వేరుగా ఉండటం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది ఉషా.
చిన్నప్పుడే అన్నాడు
తాజాగా ఉషా (Usha Mulpuri) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగశౌర్య (Naga Shourya) చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు. ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం కాబట్టి పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్‌లోనే మనవరాలి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. తనను చాలా మిస్ అవుతున్నాను. వీడియో కాల్‌లో చూస్తుంటాను.
బాధగా ఉంటుంది
అదొక్కటే బాధేస్తుంది. ఇటీవల తను నాతో పాటు నెలన్నర రోజులుంది. రెస్టారెంట్ పనుల వల్ల బిజీగా ఉండటంతో తన దగ్గరకు తరచూ వెళ్లలేకపోతున్నాను. చాలామంది పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయాక జీవితం శూన్యంగా మారుతుంది. పిల్లల పెళ్లయ్యాక మనమెలా ఉండాలనేది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరికీ ఏ సలహా ఇవ్వకూడదు, వాళ్లేం చెప్పినా మనం ఓకే చెప్పాలి.. ఇవన్నీ తెలుసుకుని అలవాటు చేసుకున్నాను.
చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
శౌర్య కంటే పెద్దోడే నచ్చుతాడు
అలాగే మనం వద్దని చెప్పినంత మాత్రాన పిల్లలు వాళ్లు చేసే పనిని ఆపేయరు. కాబట్టి మనం.. సరేనని తలూపితే మన గౌరవం నిలబడుతుంది. నేను అదే పాటిస్తున్నాను. శౌర్య.. ఎప్పుడు కూడా తన మనసులో మాట చెప్పడు. చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఏదీ చెప్పకపోయినా పర్లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి. అప్పుడే కదా మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. నా పెద్దబ్బాయి చిన్న విషయమైనా నాతో పంచుకుంటాడు. అందుకనే నాకు శౌర్య కంటే పెద్ద కుమారుడే నచ్చుతాడు.
ఇలాంటి రోజు వస్తుందని తెలుసు
చిన్నప్పుడు ఇద్దరికీ ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు. దాన్నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది అని ఉషా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment