ప్రేమజంటపై దుండగుడి దాడి | Assault attacks on love couples | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై దుండగుడి దాడి

Feb 26 2015 10:19 AM | Updated on Sep 18 2019 3:24 PM

ప్రేమజంటపై దుండగుడి దాడి - Sakshi

ప్రేమజంటపై దుండగుడి దాడి

గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

యువకుడి మృతి, యువతికి తీవ్రగాయాలు
 నరసరావుపేట/వెల్దుర్తి/చిలకలూరిపేట: గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బాణావత్ అంజినాయక్ నరసరావుపేట పట్టణంలోని పీఎన్‌సీకేఆర్ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగుంటపాలెం మండలం పిచ్చిరాజుపురంతండాకు చెందిన రామవత్ స్వాతి గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని సాదినేని చౌదరయ్య పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లమో చదువుతోంది.
 
  వీరు బుధవారం కోటప్పకొండ వచ్చిత్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లమార్గంలో కిందకు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి వీరిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో అంజినాయక్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్వాతి పెద్దగా అరవడంతో మెట్లమార్గంలో పనులు చేస్తున్న కూలీలు అక్కడకు చేరుకోవడంతో దుండగుడు పరారయ్యాడు.

 

వెళ్తూ వెళ్తూ వారివద్ద ఉన్న సెల్‌ఫోన్, రోల్డ్‌గోల్డ్ గొలుసు దోచుకెళ్లాడు. గాయపడిన స్వాతిని 108లో పట్టణంలోని ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు తరలించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.సి.వెంకటయ్య, సీఐలు వీరయ్యచౌదరి, ఎం.నాగేశ్వరరావు, ఎస్సైలు మహ్మద్ నాసర్‌బాషా, జేసీహెచ్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాగా, ఇది కచ్చితంగా స్వాతి తరఫు బంధువుల పనేనని మృతుడి తండ్రి బాలునాయక్ ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement