
మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
12న బడ్జెట్ సమర్పణ
కేవలం 16 పనిదినాలతోనే సరి
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2015-16) జీరో స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 12వ తేదీన అసెంబ్లీకి సమర్పించనున్నారు. అదే నెల 30వ తేదీన ఇందుకు సభ ఆమోదం పొందనున్నారు. కేవలం 16 పనిదినాలతోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సాధారణంగా ఈ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహిస్తారు. అలాంటిది ఎందుకోగానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా సమావేశాల నిర్వహణకు వెనుకాడుతోంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తనను కలిసిన విలేకరులకు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ భేటీకి సంబంధించి ఆర్థిక శాఖ రూపొందించిన ఫైలుకు స్వల్ప మార్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీరో స్థాయి బడ్జెట్ రూపకల్పనకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆ మేరకు కసరత్తును ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేశారు.
ప్రధానంగా పలు రంగాలకు సంబంధించిన ఏడు మిషన్లలోని పథకాలు, కార్యక్రమాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. ఈ నెలలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఎన్ని నిధులు రానున్నాయి, అలాగే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా ఎన్ని నిధులు రానున్నాయో తెలిసిన తరువాత అందుకు అనుగుణంగా రాష్ట బడ్జెట్‌కు తుది రూపం ఇవ్వనున్నారు. మంత్రులతో బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తును యనమల ఈ నెల 19వ తేదీతో ముగించనున్నారు. మార్చి 2 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ఆర్థికశాఖ తొలుత భావించింది.