సాగర్ జలాలు విడుదలచేసి దాహార్తి తీర్చండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రతాప్
నూజివీడు : ఎన్నెస్పీ మూడో జోన్ పరిధిలో ఉన్న పశ్చిమకృష్ణాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నూజి వీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలలో భాగంగా గురువారం నిర్వహిం చిన జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ జలాలను విడుదల చేసి చెరువులు నింపకపోతే వచ్చే రెండు నెలలు ఈ ప్రాంత ప్రజలతోపాటు పశువులు, జీవాలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
ఎన్నెస్పీ మూడో జోన్‌లో ఉన్న తమ ప్రాంతానికి నవంబర్ నుంచి సాగర్ జలాలను వాడుకునే హక్కు ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఒక్కచుక్క నీటిని కూడా ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమకృష్ణాలో చెరువులన్నీ ఎండిపోయాయని, బావులు, బోర్లలోని నీటిమట్టం పడిపోవడంతో నీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పడిపోవడం వల్ల నూజివీడు పట్టణానికి కృష్ణాజలాలు అందించే పథకానికి అందక ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మూడోజోన్‌కు సాగర్ జలాలు తీసుకొచ్చి చెరువులను నింపి వేసవిలో తమప్రాంత ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రతాప్ కోరారు.