నగదు మింగేస్తున్న ఏటీఎంలు | Atm Depository Machines Irritating citizens | Sakshi
Sakshi News home page

నగదు మింగేస్తున్న మిషన్లు

Published Fri, May 17 2019 12:38 PM | Last Updated on Fri, May 17 2019 12:40 PM

Atm Depository Machines Irritating citizens - Sakshi

సాక్షి, కర్నూలు: బ్యాంకులకు వెళ్లి అకౌంట్లలో నగదు డిపాజిట్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. అక్కడి సిబ్బంది తీసుకోకుండా ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్‌ మిషన్‌లో డిపాజిట్‌ చేయమని సూచిస్తున్నారు. అయితే  సాంకేతిక సమస్యలు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటీఎం మిషన్‌ ద్వారా నగదు డిపాజిట్‌ చేయడానికి ప్రయత్నిస్తే మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తి మిషన్‌ స్ట్రక్‌ అయిపోతోంది. డబ్బులేమో మిషన్‌లోకి వెళ్లి పోతున్నాయి. నగదు మాత్రం అకౌంట్లలో  జమ కావడం లేదు. దీంతో బ్యాంకు ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు.
 ప్రస్తుతం అన్ని ప్రధాన బ్యాంకులు నగదు డిపాజిట్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి రోజు వందల మంది అత్యవసరాల నిమిత్తం ఏటీఎం సెంటర్లలోని డిపాజిట్‌ మిషన్‌ల ద్వారా నగదును అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా డిపాజిట్‌ మిషన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కర్నూలు నగరంలోని ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచీకి ఖాతాదారుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఏటీఎం సెంటరులో నగదు డిపాజిట్‌ మిషన్‌లు పెట్టారు. అయితే వారం 10 రోజులుగా సాంకేతిక సమస్యలు ఖాతా దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నగదు మిషన్‌లోకి వెల్లిపోయినా నగదు ఖాతాలో జమ కాకపోవడంతో ఖాతాదారుల ఆందోళన చెందు తున్నారు. 10 రోజుల నుంచి రోజు 10 నుంచి 15 వరకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. 


సమస్య ఉన్నా చర్యలు సున్నా... 
ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 10 రోజులకుపైగా ఈ సమస్య ఉన్నా ఎస్‌బీఐ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిషన్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ వర్క్‌ వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జీఎం, ఇతర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. అయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగదు డిపాజిట్‌ చేస్తే రసీదు రావడం లేదు. ఈ సమస్యలను ఎస్‌బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లేదు. ఫిర్యాదు చేస్తే 7 రోజులకు సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలనే పరిష్కరించకపోతే గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నిస్తున్నారు. 

అత్యవసరంగా డబ్బు
పంపాలనుకుంటే.. సీను రివర్స్‌

ఆదోని పట్టణానికి చెందిన తేజ కర్నూలులో సెయింట్‌ జోసఫ్‌ కాలేజీలో బయో టెక్నాలజీ చదువుతున్నాడు. ఆదోనిలోని తండ్రి ఖాతాకు రూ.49 వేలు పంపేందుకు బుధవారం ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచీలోని ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్‌ మిషన్‌ను అశ్రయించారు. నగదు మిషన్‌లో పెట్టి వివరాలు నమోదు చేసిన తర్వాత స్ట్రక్‌ అయ్యి మొత్తం నగదు లోనికి వెల్లింది. ఇంతవరకు నగదు ఖాతాకు జమ కాలేదు. అత్యవసరం అనుకుంటే సమస్య పరిష్కారానికి వారం రోజులు పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.        


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement