
సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఉద్దండరాయనిపాలెంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడకు వచ్చిన బయట వ్యక్తులు కొందరు పరుష పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో శివబాబు (వెంకటపాలెం ), నరేష్ (మోదుగుల లంకపాలెం), సురేంద్ర (వెంకటపాలెం), శ్రీనివాసరావు (వెంకటపాలెం), నాగరాజు (మోదుగుల లంకపాలెం), లోకనాయక్ (వెలగపూడి), నరసింహ స్వామి (నెక్కల్లు) ఉన్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించి మహిళా జర్నలిస్టు దీప్తి నల్లమోతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కొంతకాలంగా అమరావతిలో రైతుల పేరిట టీడీపీ ఆందోళనలు నిర్వహిస్తుందనే ఆరోపణలకు ప్రస్తుత పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయి.
చదవండి : రాజధానిలో హింసకు కుట్ర!