
15కు భారీ ఏర్పాట్లు
- స్వాతంత్య్ర వేడుకలకు సీఎం సహా వెయ్యి మంది వీఐపీల రాక
- పోలీసు గుప్పెట్లో మహానగరం
- విశాఖ అంతటా డేగకళ్లు-తీరంలో ప్రత్యేక నిఘా
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగరం మరో అరుదైన చారిత్రక వేడుకకు వేదికవుతోంది. రాష్ర్ట స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. జీఏడీ అధికారుల పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్‌కుమార్ మీనా, ప్రత్యేక కార్యదర్శి ఎన్.వి.రమణారెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించి జిల్లా అధికారులతో చర్చించారు. స్వాతంత్య్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో తొలిసారిగా సాగరతీరంలో జరుగుతున్న ఈ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇప్పటికే వేడుకలు జరిగే బీచ్ రోడ్డును పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరానికి దారితీసే రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో నగరానికి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్‌రోడ్డును పూర్తిగా పోలీసులు తమ అధీనంలో తీసుకుని అణువణువు తనిఖీలు చేస్తున్నారు. సముద్రంలో గస్తీని ముమ్మరం చేశారు. తూర్పు నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు తీరంలో జల్లెడపడుతున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల పని తీరును పరిశీలిస్తున్నారు. పనిచేయని వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సహా వెయ్యి మందికి పైగా వీఐపీలు పాల్గోనున్నందున ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. బీచ్‌రోడ్‌లో సుమారు పదివేల మందికిపైగా ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మద్దిలపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సులను సైతం సమకూరుస్తున్నారు. వేదిక వద్ద వీఐపీల స్థాయిని బట్టి కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎండలు పెరిగే సూచనలున్నందున వీఐపీలతో పాటు సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వేదిక వద్ద భారీ షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. టూరిజం,పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థకం, సాంఘిక సంక్షేమం, విద్య, అటవీ, నీటిపారుదల, గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం తదితర శాఖలకు చెందిన 17 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ప్రతీ రోజు ఉదయం ఏడుగంటల నుంచి మార్చ్ ఫాస్ట్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి శకటాల రిహార్సల్స్ కూడా నిర్వహిస్తారు.
వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా జగదాంబ, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, సత్యం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి వేడుకలయ్యే వరకు బీచ్‌రోడ్డులో సందర్శకుల రాక పోకలను నియంత్రిస్తారు. వేడుకల నిర్వహణ బాధ్యతలను ఓవరాల్‌గా వుడా వీసీ టి.బాబూరావు నాయుడుకు అప్పగించగా, ఏర్పాట్లకు సంబంధించి ఒక్కో టాస్క్‌ను ఒక్కో సీనియర్ అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తూ 24 టీఎంలను ఏర్పాటుచేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల కోసం రాష్ర్టం నలుమూలల నుంచి వచ్చే ఎన్‌సీసీ, గ్రీన్‌కోర్, భారతస్కౌట్, రెడ్‌క్రాస్, సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులకు ఏయూలో ప్రత్యేక బస ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ర్టస్థాయి అవార్డులకు ఎంపికైన వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, సంఘ సేవకులు, స్వాతంత్ర సమరయోధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఛాలెంజ్‌గా తీసుకోండి: మీనా
రాష్ర్ట విభజన తర్వాత తొలిసారిగా విశాఖ తీరంలో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్‌కుమార్ మీనా అధికారులకు సూచించారు. గతేడాది కర్నూల్‌లో నిర్వహించిన రాష్ర్ట వేడుకలను చోటు చేసుకున్న పొరపాట్లు ఈ ఏడాది ఆస్కారం లేకుండా చూడాలన్నారు.