
రూ.2 కోసం గొడవపడ్డాడని హత్య
వెంకటేశ్వరనగర్‌లో వారం క్రితం జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసులో మిస్టరీ వీడింది.
హైదరాబాద్:వెంకటేశ్వరనగర్‌లో వారం క్రితం జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. రెండు రూపాయల కోసం మొదలైన గొడవను మనసులో పెట్టుకొని స్నేహితుడే అతడి ప్రాణం తీసినట్టు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గోషామహల్ ఏసీపీ కె.రామ్‌భూపాల్‌రావు, కుల్సుంపుర ఇన్‌స్పెక్టర్ ఆర్.కరణ్‌కుమార్‌సింగ్‌తో కలిసి శనివారం తెలిపిన వివరాల ప్రకారం... జియాగూడ వెంకటేశ్వరనగర్‌లోని ఓ భవనం 3వ అంతస్తులో ఉండే వి.రాజేష్(లంబు రాజు) ఆటో డ్రైవర్. ఇతనికి భార్య సంతోషిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన రాజు తరచూ భార్యతో గొడవపడే వాడు. ఈనెల 22న మరోసారి ఘర్షణ పడటంతో భార్య పిల్లలను తీసుకొని ఆస్మాన్‌ఘడ్‌లో ఉండే పిన్ని ఇంటికి వెళ్లింది. 25న పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే వెంకటేష్‌నగర్‌కు చేరుకుంది. బయట నుంచి తలుపు గడియపెట్టి ఉండటంతో తీసి చూడగా... భర్త రాజు దారుణ హత్యకు గురై కనిపించాడు.
హతుడి తల్లి అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వరనగర్‌కు చెందిన రాజు స్నేహితుడు సందీప్(33)ను విచారించగా తానే హత్య చేసినట్టు వెల్లడించాడు. మద్యం తాగిన సమయంలో రాజు తనతో రూ. 2 కోసం గొడవపడ్డాడని, తనతోపాటు ఉన్న మరో స్నేహితుడు రూపేష్‌ను తీవ్రంగా కొట్టాడని చెప్పాడు. అది మనసులో పెట్టుకున్న తాను రాజును హత్య చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. 23వ తేదీ మధ్యాహ్నం ఇద్దరం కలిసి మద్యం తాగామని, రాజు ఇంటికి వెళ్లాక మళ్లీ మద్యం తాగామని, మత్తులోకి జారుకోగానే ముందే వేసుకున్న పథకం ప్రకారం రాడ్‌తో తలపై కొట్టానని, కొనఊపితో ఉండటంతో అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకుని బాదానని చెప్పాడు. రాజు చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పారిపోయానని తెలిపాడు. దీంతో నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.