auto driver murder case
-
కట్టుకున్న భార్యే సూత్రధారి
నెల్లూరు, మనుబోలు: మండలంలోని మడమనూరు గ్రామంలో వారంరోజుల క్రితం జరిగిన ఆటో డ్రైవర్ చేవూరు శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రియుడి ద్వారా ఆమె పథకం ప్రకారం భర్తను హత్య చేయించినట్టుగా వారు తెలిపారు. బుధవారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో గూడూరు డీఎస్పీ బాబూప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మడమనూరుకు చెందిన చేవూరు శ్రీనివాసులు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఈనెల 28వ తేదీ రాత్రి భోజనం ముగించుకుని ఇంటి వెనక్కు వెళ్లిన అతను దుండగుల కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను పిలిపించి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈక్రమంలో గతంలో ఉన్న గొడవలను దృష్టిలో ఉంచుకుని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనివాసులును హత్య చేసి ఉంటాడని మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా ఆధారంగా.. మృతుడి ఇంటి సమీపంలో దొరికిన కత్తులు, చేతి రుమాలు, చెప్పులు, తమిళ అక్షరాలున్న అగ్గిపెట్టె తదితర ఆధారాలతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈక్రమంలో అనుమానిస్తున్న వ్యక్తికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. అదే సమయంలో మృతుడి భార్య శారద వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె సొంతూరు ముత్తుకూరు మండలంలోని మల్లూరులో విచారణ చేయగా ఆమెకు తమిళనాడులోని పుదుకీచలం గ్రామానికి చెందిన రాజేంద్రన్ అనే వ్యక్తితో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో రాజేంద్రన్, శారదల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజేంద్రన్ కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం రాజేంద్రన్‌తోపాటు మరో ఇద్దరు మోటార్‌బైక్‌పై నెల్లూరు వైపు వస్తున్నారు. గూడూరు సీఐ వంశీధర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. రూ.50 వేలకు బేరం రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శారద భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఈ నేపథ్యంలో రాజేంద్రన్ తమిళనాడులోని పలుతిగైమేడు గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తితోపాటు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడితో హత్య చేసేందుకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం గత నెల 28వ తేదీ రాత్రి ముగ్గురూ కలిసి మడమనూరు వచ్చి శ్రీనివాసులును వారి పశువుల దొడ్డిలో కత్తులతో పొడిచి చంపారు. వీరి ముగ్గురితోపాటు మృతుడు భార్య శారదను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సమావేశంలో గూడూరు సీఐ వంశీధర్, రూరల్ ఎస్సై శ్రీనివాసులురెడ్డి, మనుబోలు ఎస్సై సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అజయ్ హంతకుడు చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరమండలం పరిధిలోని బోయిన్పల్లి ప్రాంతంలో ఈ నెల 14న చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. సంజీవయ్యనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆటోడ్రైవర్ అజయ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేసింది అతడి స్నేహితుడు తివారీగా తేల్చారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన ప్రత్యేక బృందాలు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. బోయిన్పల్లి ఠాణా పరిధిలోని చిన్నతోకట్ట సంజీవయ్యనగర్‌కు చెందిన దశరథ మూడో కుమారుడు అజయ్‌కుమార్ కిరాయికి ఆటో నడుపుకునేవాడు. మద్యానికి బానిసైన ఇతను తరచూ స్నేహితులతో కలిసి స్థానిక కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో మద్యం సేవించేవాడు. అనేక సందర్భాల్లో రాత్రి అక్కడే పడుకుని ఉదయం ఇంటికి వచ్చేవాడు. ఇందులో భాగంగానే ఈ నెల 14 మధ్యాహ్నం వరకు ఆటో నడిపిన అజయ్ ఆపై ఇంటికి వచ్చాడు. ఆటోను ఇంటి వద్దే పార్క్ చేసి స్నేహితులు పిలుస్తున్నారంటూ బయటికి వెళ్లాడు. రాత్రి సమయంలో స్నేహితులతో కమ్యూనిటీహాల్ వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన దశరథ్ ఇంటికి రమ్మని పిలిచాడు. తర్వాత వస్తానంటూ చెప్పిన అజయ్‌కుమార్ తండ్రిని పంపేశాడు. అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో యధావిధిగా కమ్యూనిటీ హాల్ వద్దే నిద్రించి ఉంటాడని దశరథ దంపతులు భావించారు. మరుసటి రోజు ఉదయానికీ అజయ్ జాడ లేకపోవడంతో కమ్యూనిటీ హాల్ వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. హత్యాస్థలానికి కొద్దిదూరంలో మద్యం సీసా, వాటర్ ప్యాకెట్లతో పాటు రక్తపు మరకలతో ఉన్న బండరాయి కనిపించడంతో ఆ రోజు రాత్రి అజయ్‌కుమార్‌తో కలిసి మద్యం సేవించిన స్నేహితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఒకరికి నేరచరిత్ర ఉండటంతో అతడిని అనుమానించినా కాదని తేలింది. మరోపక్క తివారీ అనే మరో స్నేహితుడి ఆచూకీ లేకపోవడంతో అతడినే తొలి అనుమానితుడిగా చేర్చిన పోలీసులు ఇతగాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గురువారం అర్ధరాత్రి అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నగరానికి తరలించి హత్యకు గల కారణాలను విచారించాలని నిర్ణయించారు.ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఒకటిరెండు రోజుల్లో తివారీ అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. -
హత్య కేసులో నిందితురాలి లొంగుబాటు
ఈ నెల 7వ తేదీన జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసులో నిందితులలో ఒకరైన అస్మా సుల్తానాను చాంద్రాయణగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఘాజీమిల్లత్ కాలనీకి చెందిన అస్మా సుల్తానా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇటీవల ప్రకటనలు ఇచ్చింది. దీంతో హఫీజ్‌బాబానగర్ ఉమర్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సమీ అహ్మద్ సిద్ధిఖీ భార్య అస్మాఖాన్ కూడా దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు అస్మాఖాన్‌ను ఈనెల 7వ తేదీన అస్మాసుల్తానా పిలిపించుకుంది. అయితే, ఇతర పురుషులతోపాటు తన భార్యను కలిపి ఉంచటంపై అహ్మద్ సిద్దిఖీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అస్మా సుల్తానాతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనలో ముఖ్తార్ మరో ఇద్దరు యువకులు కలసి అహ్మద్ సిద్దిఖీని కొట్టి చంపారు. ఘటనపై అస్మాఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉండగా అస్మాసుల్తానా మాత్రం కోర్టులో లొంగిపోయింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా, అస్మా సుల్తానా భర్త జహంగీర్ అలియాస్ పర్వేజ్ కూడా పలు కేసులలో నిందితుడిగా ఉండడంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అతనిపై పి.డి.యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. కాగా, తమ విచారణలో అస్మా సుల్తానా ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. -
రూ.2 కోసం గొడవపడ్డాడని హత్య
హైదరాబాద్:వెంకటేశ్వరనగర్‌లో వారం క్రితం జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. రెండు రూపాయల కోసం మొదలైన గొడవను మనసులో పెట్టుకొని స్నేహితుడే అతడి ప్రాణం తీసినట్టు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గోషామహల్ ఏసీపీ కె.రామ్‌భూపాల్‌రావు, కుల్సుంపుర ఇన్స్పెక్టర్ ఆర్.కరణ్కుమార్సింగ్తో కలిసి శనివారం తెలిపిన వివరాల ప్రకారం... జియాగూడ వెంకటేశ్వరనగర్‌లోని ఓ భవనం 3వ అంతస్తులో ఉండే వి.రాజేష్(లంబు రాజు) ఆటో డ్రైవర్. ఇతనికి భార్య సంతోషిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన రాజు తరచూ భార్యతో గొడవపడే వాడు. ఈనెల 22న మరోసారి ఘర్షణ పడటంతో భార్య పిల్లలను తీసుకొని ఆస్మాన్‌ఘడ్‌లో ఉండే పిన్ని ఇంటికి వెళ్లింది. 25న పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే వెంకటేష్‌నగర్‌కు చేరుకుంది. బయట నుంచి తలుపు గడియపెట్టి ఉండటంతో తీసి చూడగా... భర్త రాజు దారుణ హత్యకు గురై కనిపించాడు. హతుడి తల్లి అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వరనగర్‌కు చెందిన రాజు స్నేహితుడు సందీప్(33)ను విచారించగా తానే హత్య చేసినట్టు వెల్లడించాడు. మద్యం తాగిన సమయంలో రాజు తనతో రూ. 2 కోసం గొడవపడ్డాడని, తనతోపాటు ఉన్న మరో స్నేహితుడు రూపేష్‌ను తీవ్రంగా కొట్టాడని చెప్పాడు. అది మనసులో పెట్టుకున్న తాను రాజును హత్య చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. 23వ తేదీ మధ్యాహ్నం ఇద్దరం కలిసి మద్యం తాగామని, రాజు ఇంటికి వెళ్లాక మళ్లీ మద్యం తాగామని, మత్తులోకి జారుకోగానే ముందే వేసుకున్న పథకం ప్రకారం రాడ్‌తో తలపై కొట్టానని, కొనఊపితో ఉండటంతో అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకుని బాదానని చెప్పాడు. రాజు చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పారిపోయానని తెలిపాడు. దీంతో నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.