
అజయ్‌కుమార్ మృతదేహం (ఫైల్) అజయ్‌కుమార్ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరమండలం పరిధిలోని బోయిన్‌పల్లి ప్రాంతంలో ఈ నెల 14న చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. సంజీవయ్యనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆటోడ్రైవర్ అజయ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేసింది అతడి స్నేహితుడు తివారీగా తేల్చారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన ప్రత్యేక బృందాలు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లి ఠాణా పరిధిలోని చిన్నతోకట్ట సంజీవయ్యనగర్‌కు చెందిన దశరథ మూడో కుమారుడు అజయ్‌కుమార్ కిరాయికి ఆటో నడుపుకునేవాడు. మద్యానికి బానిసైన ఇతను తరచూ స్నేహితులతో కలిసి స్థానిక కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో మద్యం సేవించేవాడు. అనేక సందర్భాల్లో రాత్రి అక్కడే పడుకుని ఉదయం ఇంటికి వచ్చేవాడు. ఇందులో భాగంగానే ఈ నెల 14 మధ్యాహ్నం వరకు ఆటో నడిపిన అజయ్ ఆపై ఇంటికి వచ్చాడు. ఆటోను ఇంటి వద్దే పార్క్ చేసి స్నేహితులు పిలుస్తున్నారంటూ బయటికి వెళ్లాడు. రాత్రి సమయంలో స్నేహితులతో కమ్యూనిటీహాల్ వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన దశరథ్ ఇంటికి రమ్మని పిలిచాడు. తర్వాత వస్తానంటూ చెప్పిన అజయ్‌కుమార్ తండ్రిని పంపేశాడు.
అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో యధావిధిగా కమ్యూనిటీ హాల్ వద్దే నిద్రించి ఉంటాడని దశరథ దంపతులు భావించారు. మరుసటి రోజు ఉదయానికీ అజయ్ జాడ లేకపోవడంతో కమ్యూనిటీ హాల్ వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న బోయిన్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. హత్యాస్థలానికి కొద్దిదూరంలో మద్యం సీసా, వాటర్ ప్యాకెట్లతో పాటు రక్తపు మరకలతో ఉన్న బండరాయి కనిపించడంతో ఆ రోజు రాత్రి అజయ్‌కుమార్‌తో కలిసి మద్యం సేవించిన స్నేహితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఒకరికి నేరచరిత్ర ఉండటంతో అతడిని అనుమానించినా కాదని తేలింది. మరోపక్క తివారీ అనే మరో స్నేహితుడి ఆచూకీ లేకపోవడంతో అతడినే తొలి అనుమానితుడిగా చేర్చిన పోలీసులు ఇతగాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గురువారం అర్ధరాత్రి అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నగరానికి తరలించి హత్యకు గల కారణాలను విచారించాలని నిర్ణయించారు.ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఒకటిరెండు రోజుల్లో తివారీ అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.