సమ్మె ఉద్ధృతం
చిక్కడపల్లి,న్యూస్‌లైన్:
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని, పెరిగిన డీజిల్, గ్యాస్ ధరలకనుగుణంగా ఆటోమీటర్ చార్జీలు పెంచాలని, పీల్చిపిప్పిచేస్తున్న చలాన్ జీవో108ను వెంటనే రద్దు చేయాలన్న తదితర డిమాండ్లతో ఆటోసంఘాలు చేపట్టిన సమ్మె ఉద్ధృతమవుతోంది. దీంతో రెండోరోజు ఆది వారం నగరంలో చాలా ప్రాంతాల్లో ఆటోలు నిలిచిపోయాయి. సర్కారు వైఖరిని వ్యతిరేకిస్తూ ఆటోకార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో భారీఎత్తున రాస్తారోకో నిర్వహించి రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి సర్కారుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఎఫ్‌టీయూ, టీఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్, టీఆర్‌ఎస్‌కేవీ తదితర సంఘాల నాయకులు ఈటీ నర్సింహ, ఈశ్వర్‌రావు, శ్రీనివాస్, నరేందర్, అనూరాధ, పద్మ,బోస్,రామారావు, మారుతీరావు, విజితారెడ్డి,దాసరి రమేష్, అమానుల్లాఖాన్, దస్తగిరిలు విలేకరులతో మాట్లాడారు. డ్రైవింగ్ లెసైన్స్‌కు 8వ తరగతి అర్హతను రద్దు చేయాలని, హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ విధానాన్ని ఆపాలని కోరారు. నిబంధనల పేరుతో జారీచేసిన 108 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఆటోడ్రైవర్‌పై దాడి,తీవ్రగాయాలు : కాగా ఆటో కార్మిక సంఘాలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా అటుగా వస్తున్న మూడు ఆటోలను నాయకులు ధ్వంసం చేశారు. దీంతో అద్దంపడి డ్రైవర్‌పై ముక్కుపై తీవ్రగాయం కావడంతో పోలీసులు ప్రాథమిక చికిత్స నిర్వహించి పంపించేశారు.
ఆగని దోపిడీ
నగరంలో చాలావరకు ఆటోలు సమ్మెలో ఉండడంతో కొందరు ఆటోవాలాలు రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన వారు ఆదివారం తిరుగుముఖం పట్టడం, ఇళ్లకు చేరుకునేందుకు ఆటోలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిం చాల్సి వచ్చింది. ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన వంద బస్సులు ఏమూలకు చాలకపోవడంతో ఆటోవాలాల దోపిడీకి ప్రయాణికులు జేబులు గుల్లచేసుకున్నారు. స్వల్పదూరాలకే వందలు డిమాండ్ చేయడం కనిపించింది. సోమవారం పాఠశాలలకు రాకపోకలు సాగించే 25 వేల ఆటోలను కూడా నిలిపివేస్తామని జేఏసీ నాయకులు ఈసంద ర్భంగా ప్రకటించారు.
నేడు చలోఅసెంబ్లీ
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సోమ వారం ఉదయం 11 గంటలకు హిమాయత్‌నగర్ నుంచి అసెంబ్లీ వరకు మహాప్రదర్శన నిర్వహిస్తామని ఆటో సంఘాల జేఏసీ నేతలు నరేందర్,వెంకటేశ్,సత్తిరెడ్డిలు తెలిపారు.