
సాక్షి,హైదరాబాద్:ఆటో,క్యాబ్‌డ్రైవర్ల యూనియన్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. పెద్దఎత్తున నిరసన తెలుపుతూ యూనియన్ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికులకు రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. కార్మిక చట్టాలను సవరించాలని కోరారు. ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలన్నారు.
అదే విధంగా క్యాబ్ జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ఓల, ఉబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమిషన్ ఆపాలన్నారు. టోల్ టాక్స్, రోడ్ టాక్స్‌లను వెంటనే ఎత్తివేయాలిని డిమాండ్ చేశారు. ఫిట్‌నెస్ ఇన్సూరెన్స్ చార్జీలను తగ్గించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment