
సాక్షి, మామిడికుదురు : ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే సమయంలో తమ కష్టాలు, బాధలను జననేత, రాజన్న తనయుడు వైఎస్ జగన్‌కు చెప్పుకుని పరిష్కారం చూపించండన్నా అని అడుగుతున్నారు. 198వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మామిడికుదురులో శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్ సభ్యులు తమ సమస్యలు వివరిస్తూ వైఎస్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఆదుకోవాలని కోరుతూ కొన్ని అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు.
డీజిల్ రేట్లు అధికం కావడంతో కార్మికులకు సరైన కనీస వేతనం కూడా గిట్టుబాటు కావడం లేదని వైఎస్ జగన్‌కు ఆటో యూనియన్ బృందం తమ గోడును వెల్లబోసుకుంది. గత 8 ఏళ్లుగా సరైన ఆటోస్టాండ్ లేదని, ఆ సౌకర్యం కల్పించేందుకు తమకు సాయం చేయాలని జననేతను కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మామిడికుదురు శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్ అధ్యక్షులు కడలి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు, తదితరులున్నారు.
కాగా, మరోవైపు మిడికుదురు, కైకాలపేట గ్రామాలలో ప్రజాసంకల్పయాత్రకు భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చి జననేతతో కలిసి అడుగులు వేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను వైఎస్ జగన్‌కు వివరిస్తున్నారు. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.