సాక్షి, మచిలీపట్నం : అవనిగడ్డ ఉప ఎన్నికల పోరులో తెలుగుదేశం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఊరిస్తున్న ఉపపోరు ఫలితాన్ని అందుకునేందుకు టీడీపీ అవస్థలు పడుతోంది. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమం టీడీపీకి శిరోభారంగా మారగా మరోవైపు ఊపందుకున్న మాగాణి పనులతో ఓటింగ్ తక్కువ జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇది చాలదన్నట్టు తాజాగా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపు టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం జరుగుతున్న ఉప ఎన్నికల్లో స్వతంత్రులు మరింత పట్టు బిగిస్తే టీడీపీ అభ్యర్థి గెలుపు, మెజార్టీలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
చర్చనీయాంశంగా కాంగ్రెస్ బహిష్కరణ పిలుపు..
అవనిగడ్డ ఉప ఎన్నికలను బహిష్కరించాలంటూ కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అందుకు దీటుగా ఓటు వేసి సమైక్య నినాదం చాటాలని టీడీపీ ఉపపోరులో గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోగా, ఇక్కడ ఆ పార్టీ స్థానిక నాయకత్వం మాత్రం అందుకు నిరసనగా ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యాంధ్ర విషయంలో గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న టీడీపీ.. ఎక్కడిమాట అక్కడ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రెండూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమంలో వెనుబడిన సంగతి తెలిసిందే.
అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఎన్నికల బహిష్కరణకు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు మంగళవారం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి నిరసన తెలిపేలా అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ఓటు వేయకుండా ఓటర్లు బహిష్కరించాలంటూ ఇదే నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు పిలుపునివ్వడం గమనార్హం. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమం, మాగాణి పనులు ఊపందుకోవడం వెరసి గురువారం జరిగే అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.
దీనికితోడు కాంగ్రెస్ నేతల పిలుపుతో ఎన్నికలను ఓటర్లు బహిష్కరిస్తే టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు మరింత ఇబ్బందికరమే. వీటికితోడు స్వతంత్ర అభ్యర్థులు సైకం రాజశేఖర్, రావు సుబ్రహ్మణ్యంలు పట్టు బిగిస్తే టీడీపీ అభ్యర్థి మెజార్టీ తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలు మింగుడుపడని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మరికొందరు నేతలు రెండు రోజుల కిత్రం నియోజకవర్గంలో మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసి దివంగత అంబటి బ్రాహ్మణయ్యకు నివాళులర్పించాలని, సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని వ్యూహాత్మకంగా ఉపన్యాసాలు ఇచ్చారు.
సర్వం సిద్ధం..
అవనిగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించి తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావులు అవనిగడ్డలో పోలింగ్ కేంద్రాలు, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు వెయ్యి మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ, సామగ్రి పంపిణీ తదితర ఏర్పాట్లను బందరు ఆర్డీవో పి.సాయిబాబు పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా కలెక్టర్, ఎస్పీ అన్ని శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఇరకాటంలో టీడీపీ
Published Wed, Aug 21 2013 12:44 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement