రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ చేసిన సేవలకు గుర్తింపుగా పేట వీఆర్వోలు తాము నిర్మించుకున్న నూతన భవనానికి ఆయన పేరు పెట్టుకోవడం...
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ చేసిన సేవలకు గుర్తింపుగా పేట వీఆర్వోలు తాము నిర్మించుకున్న నూతన భవనానికి ఆయన పేరు పెట్టుకోవడం అభినందనీయమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎస్.ఆర్.శంకరన్ వీఆర్వోల భవనాన్ని శనివారం ఆయన కలెక్టర్ రఘునందన్‌రావుతో కలసి ప్రారంభించారు. అలాగే కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శంకరన్ విగ్రహాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు ఆవిష్కరించారు.
సభలో ఎంపీ మాట్లాడుతూ వీఆర్వోలు నిర్మించుకున్న నూతన భవనానికి రాష్ట్రంలో తొలిసారిగా ఒక ఐఏఎస్ అధికారి పేరు పెట్టుకోవడం గర్వకారణమని, అదే సమయంలో వారు విధినిర్వహణలో శంకరన్ పేరు నిలబెట్టాలని కోరారు. వివాదాలు పెంచాలన్నా, తగ్గించాలన్నా గ్రామీణ సేవల్లో కీలకపాత్ర పోషించే వీఆర్వోల మీదనే అధారపడి ఉందన్నారు. ఇసుక కొరత వల్ల ఇందిరమ్మ పేజ్-1,2 లలో మంజూరైన గృహాలు నిర్మించుకోవడంలో లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ పనులకు సంబంధించిన నిర్మాణాలకు అందుబాటులో ఉన్న నదీతీరాలు, ఏటి ప్రాంతాల్లో నుంచి ఇసుక సరఫరా నిబంధనల్లో వెసులు బాటు కల్పించాలని అధికారులను కోరారు. కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడతూ పేటలో వీఆర్వోలు నిర్మించుకున్న భవనానికి ఐఏఎస్ అధికారి శంకరన్ పేరు పెట్టడం అభినందనీయమని, ఆయన పేరు పెట్టుకుంటే సరిపోదని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్క వీఆర్వో శంకరన్ సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ వీఆర్వోలు ఉత్తమమైన సేవలను అందించి గ్రామీణ ప్రాంత ప్రజల మన్నన్నలు పొందాలని సూచించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పేటలో మొట్టమొదటి సారిగా వీఆర్వోలు భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు అనేక గ్రామాల నుంచి తహశీల్థార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సరైన వసతి లేక చెట్ల కిందే కూర్చునే వారని ఇకనుంచి అలాంటి పరిస్థితి లేకుండా భవనాన్ని నిర్మించుకోవడం శుభపరిణామమన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న బ్రిటీష్‌కాలం నాటి తహశీల్థార్ కార్యాలయం శిథిలావస్థలో ఉందని, దానిని సబ్‌జైల్ మాదిరిగా పునర్నిర్మించి ఆధునీకీకరణ చేయాలని కోరారు. అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం పేస్-7 భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బండిపాలెం, పోచంపల్లి, ధర్మవరప్పాడు తండా, అన్నవరం గ్రామాలకు చెందిన16 మందికి 15 ఎకరాల 72 సెంట్ల భూమిని పంపిణీ చేస్తూ పట్టాలను అందజేశారు.
జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందన, డీఎస్పీ చిన్నహుస్సేన్, పేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి తహశీల్దార్లు బాలకృష్ణారెడ్డి, కే ఏఎస్.జెన్నీయస్, మైనర్‌బాబు, తన్నీరు నాగేశ్వరరావు, మదార్‌సాహెబ్, ఆకుల శ్రీకాంత్, పాటిబండ్ల వెంకట్రావు, పలు గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు.