
సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే చిట్టివలస జ్యూట్ మిల్ సమస్య పరిష్కారం కావటం సంతోషంగా ఉందన్నారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా చిట్టివలస జ్యూట్ మిల్ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. ప్రభుత్వం జ్యూట్ మిల్‌ను తెరిపించడానికి ప్రయత్నించినా.. పరిశ్రమ నిర్వహించడానికి యాజమాన్యం అంగీకరించలేదని ఆరోపించారు. చివరకూ ప్రభుత్వ చొరవతో కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.
శాశ్వత, రిటైర్మెంట్, అప్రెంటీస్‌లకు కలుపుకుని మొత్తం 6 వేల మందికి సుమారు రూ. 24 కోట్ల రూపాయల నష్ట పరిహారం ఏడాదిలోగా చెల్లించడానికి జ్యూట్ మిల్ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ఏ కార్మికునికి కష్టం కలగకుండా చూడాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు శ్రీనివాసరావు.