ప్రతీకాత్మక చిత్రం
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌ల వద్ద ఆదివారం ఐదుగురు అయ్యప్పస్వాములు వరద నీటిలో మునిగిపోయారు. ఘాట్‌లో ఉన్న మత్స్యకారులు నలుగురిని రక్షించారు. మరో స్వామి నీటిలో గల్లంతయ్యాడు. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ మధురానగర్‌కు చెందిన పసుపులేటి ధర్మ ముఖేష్, పసుపులేటి నాగకల్యాణ్ అన్నదమ్ములు. శుక్రవారం తమ్ముడు నాగకల్యాణ్ అయ్యప్ప మాల ధరించగా అన్నయ్య ధర్మముఖేష్ శనివారం మాల వేసుకున్నాడు. వీరితో పాటు వారి బంధువులైన పిచ్చేశ్వరరావు, హేమంత్‌కుమార్, నాగరాజు శుక్రవారం మాల ధరించారు.
చిరుద్యోగైన ధర్మ ముఖేష్ ఆదివారం తమ్ముడు నాగకల్యాణ్, బంధువులతో కలిసి అమరావతి దేవస్థానానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం 4.30 సమయంలో సీతానగరం పుష్కరఘాట్ వద్ద స్నానం చేసి ఇక్కడే పూజ చేసుకుందామని కృష్ణా నదిలో దిగారు. ఘాట్‌లకు, పుష్కర కాలువకు మధ్యలో వున్న ఐరన్ పైపులు పట్టుకుని వీరు ఆడుకుంటుండగా మొదట నాగకల్యాణ్ నీటిలోకి జారిపోయాడు. అది గమనించిన ముఖేష్ తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో తాను కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగతా ముగ్గురు కూడా నీటిలో కొట్టుకుపోతూ చేతులు పైకెత్తి కేకలు వేయడంతో.. మత్స్యకారులు గమనించి నలుగురిని కాపాడగలిగారు. ముఖేష్ నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment