బాలాజీ మృతదేహం
సాక్షి, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): చిత్తూరులో పుట్టి, విశాఖలో ప్రేమాయణం నడిపి, చివరకు ఆదివారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి విషాదంతం ఇది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బత్తయ్య, హేమవతి ఏకైక కుమారుడు వలజపేట బాలాజీ (31) హోటల్ మేనేజ్‌మెంట్ చేసి తమిళనాడులో ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చనిపోవడంతో తండ్రితో ఫోన్‌లోనే మాట్లాడుతూ ఇంటికి రాకుండా కాలం గడిపాడు. రెండున్నర సంవత్సరాల క్రితం చెన్నై నుంచి ఇంటికి వచ్చిన బాలాజీ విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బాలాజీ వైజాగ్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు తాడిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించి, ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కొద్ది రోజులకు ఆ బాలికను తీసుకుని విజయవాడ వచ్చేశాడు. విజయవాడ వచ్చినప్పటి నుంచి ఆ బాలికను అనుమానించేవాడు. పలుసార్లు బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో ఒకసారి పంచాయితీ జరిగింది.
విజయవాడ ఆటోనగర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఇదే పంచాయితీ జరిగింది. చివరకు ఆ బాలిక విసిగిపోయి అజిత్‌సింగ్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన ఆ బాలిక నివాసం ఉంటున్న బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని ఆ బాలికను పిలిచి విచారించగా, తనకు ఇష్టం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు సైతం తమకు కేసు ఏమీ వద్దని చెప్పారు. దీంతో బాలాజీని ఎటువంటి కేసు లేకుండా పోలీసులు వదిలేశారు. ఈ క్రమంలో బాలాజీ శనివారం రాత్రి తాడేపల్లి సమీపంలో ప్రకాశం బ్యారేజీ 10వ ఖానా వద్ద కృష్ణానదిలోకి దూకాడు. ఈ క్రమంలో గేటుపై పడటంతో తల వెనుక భాగం, ఎదుటి భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గేటు కింద మృతదేహం పడిపోయింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి బత్తయ్యకు సమాచారం ఇచ్చామని, ఆయన వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment