నియంతలా చంద్రబాబు పరిపాలన
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట మండిపాటు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలను రెచ్చగొడుతూ ఓ నియంతలా పాలిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఛైర్మన్ పదవుల ఎన్నికల తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతలైన అంబటి రాంబాబు, ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే ముస్తఫాలపై దౌర్జన్యం చేయడం... ఎంపీటీసీల కిడ్నాప్.. ప్రకాశం జడ్పీ ఎన్నిక కొద్దిసేపట్లో జరుగుతుందనగా ఒక జడ్పీటీసీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం లాంటి సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. గడికోట ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కర్నూలు జడ్పీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నా అక్రమంగా చేజిక్కించుకున్న టీడీపీ, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తమ పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీని పోలీసులతో అరెస్టు చేయించి ఓటింగ్‌కు రానీయకుండా చే శారని గడికోట పేర్కొన్నారు. నెల్లూరులో కూడా పోలీసుల సహకారంతో పెంచలమ్మ అనే వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీని తీసుకె ళ్లారన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు స్థానిక సంస్థలను అక్రమంగా, అప్రజాస్వామికంగా చేజిక్కించుకోవడానికి దౌర్జన్యాలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గూండాయిజం, రౌడీయిజంతో టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి హింసాత్మక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.