- వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం
కంచికచర్ల రూరల్ : అమలు చేయలేని హామీలిచ్చి సీఎం చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. కంచికచర్లలో ఆయన ఆదివారం నందిగామ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ మెండితోక జగన్మోహన్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ హామీల కోసం చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. రాజధాని కోసం చందాలు, హుండీలు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
హైద్రాబాద్‌లో సీఎం క్యాంపు ఆఫీస్ కోసం రూ.10కోట్లు ఖర్చుపెట్టారని, అదే నగదు మన రాష్ట్రంలో ఖర్చుచేస్తే కొన్ని కార్యాలయాలైనా పూర్తయ్యేవని పేర్కొన్నారు. రుణాల మాఫీపై వెంటనే స్పష్టత ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదవి కోసం ఆరాటం పడ్డారే తప్ప, రైతుల సంక్షేమం కోసం ఏం పనిచేయ లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కోవెలమూడి వెంకటనారాయణ, మంగునూరి కోండారెడ్డి, చింతా రవీంద్రనాధ్, నంబూరి పెదబాబు, అబ్బూరి శివనాగమల్లేశ్వరరావు, మార్త శ్రీనివాసరావు, కాలవ వాసుదేవరావు పాల్గొన్నారు.
తల్లిదండుల్ని క్షోభ కు గురి చేయకండి
పెద్దాపురం(వీరులపాడు) : విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు జీవితాంతం క్షోభపడుతూ బతకాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారధి, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు అన్నారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యిప్పల నాగిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జి మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.