
బాబుది ఐరన్‌లెగ్
బుచ్చిరెడ్డిపాళెం : అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇదంతా చంద్రబాబు ఐరన్‌లెగ్ మహిమ...
బుచ్చిరెడ్డిపాళెం : అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇదంతా చంద్రబాబు ఐరన్‌లెగ్ మహిమ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడులోని సూరా శ్రీనివాసులురెడ్డి నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను పాలించే వాళ్లు సూర్యాస్తమయం తర్వాత ప్రమాణస్వీకారం చేయకూడదని పలువురు పీఠాధిపతులు చెప్పారన్నారు.
అలా చేస్తే ఆయా దేశాలు, రాష్ట్రాలకు అరిష్టమని హెచ్చరించారన్నారు. చంద్రబాబు రాత్రి 7.27 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. అది అరిష్టమనేందుకు సూచికగా ప్రమాణస్వీకారానికి అరగంట ముందు హిమాచల్‌ప్రదేశ్‌లో 25 మంది తెలుగు పిల్లలు నదిలో కొట్టుకుపోయి మృతిచెందారన్నారు. ఆ తర్వాత కూడా ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
ఈ క్రమంలోనే హుదుద్ తుపాన్‌తో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అల్లకల్లోలంగా మారాయన్నారు. ప్రధానంగా విశాఖపట్టణం అతలాకుతలమైందన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరమే ప్రకృతి కన్నెర్ర చేసిందన్నారు. ఇది ఇంతటితో ఆగదని ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారన్నారు.
హామీలే నెరవేర్చలేదు..పథకాల పేరిట కాలయాపన ఎందుకు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలే ఇంతవరకు చంద్రబాబు నెరవేర్చలేదని, పథకాల పేరిట కాలయాలన ఎందుకుని ప్రసన్న అన్నారు. బడి పిలుస్తోందిరా అనే కార్యక్రమంతో ఒరిగిందేంటని ప్రశ్నించారు. పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. గత జన్మభూమిలో తనతో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి పిల్లలను పాఠశాలల్లో చే ర్పించామన్నారు.
మౌలిక వసతులు లేక విద్యార్థులు వెనుదిరుగుతున్నారని, వాటిపై దృష్టి సారించాలని చంద్రబాబుకు హితవు పలికారు. పొలం పిలుస్తోంది రా కార్యక్రమం రైతులకు ఉపయోగపడటం లేదన్నారు. ప్రభుత్వమే ధాన్యాన్ని కొని పుట్టికి రూ.16 వేలు చెల్లించాలనిడిమాండ్ చేశారు. విత్తనాల కోసం యాతన పడే దుస్థితిని దూరం చేయాలన్నారు. జన్మభూమి కార్యక్రమం పింఛన్ల పంపిణీకి మినహా మరెందుకు ఉపయోగపడడం లేదన్నారు. పిచ్చిపిచ్చి పథకాలను మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పింఛన్ ఇచ్చేందుకు రూ.100 ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రసన్న నిలదీశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చే యనున్నామన్నారు.