తుపానును జయించింది.. సిలిండర్ కబళించింది!
హుద్హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన రోజునే పుట్టిందా పసికందు. తుపాను గాలులను, అంతటి ప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ భూమ్మీదకు వచ్చింది. కానీ.. మంగళవారం నాటి గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో ఎంతోమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆ ఒక్క చిన్నారి మాత్రం ప్రాణాలు వదిలేసింది.
దేవీప్రసాద్, భవానీ దంపతులు విశాఖ నగరం రంగిరీజు వీధిలో ఉంటున్నారు. వారికి అక్టోబర్ 12న.. హుద్‌హుద్ తుపాను చెలరేగిన రోజున.. ఆడపిల్ల పుట్టింది. కానీ, వారి ఆనందం అంతే త్వరగా ఆవిరైపోయింది. వారి ఇంటి ఎదుటే కోట సత్యనారాయణ కుటుంబం ఉంది. ఆయన భార్య టీ పెట్టడానికి ప్రయత్నించగా గ్యాస్ పొయ్యి వెలగలేదు. వాళ్లూ వీళ్లు వచ్చి చూశారు. వాళ్లలో ఒకరు పిన్‌తో గ్యాస్ సిలిండర్ పై భాగంలో తుడవడం మొదలుపెట్టారు. అంతే.. ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. సత్యనారాయణ ఇల్లంతా మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ఎదురింట్లో పాప ఆడుకుంటోంది. తల్లి ఇంట్లో పని చేసుకుంటూ పాపను ఇంట్లో పడుకోబెట్టింది. పేలుడు ధాటికి పాప ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది. ఇంతలో ఇంటి పై కప్పు నుంచి ఒక పెంకు సరిగ్గా పాప ముఖంపై పడింది. ఆ మరుక్షణమే పాప ప్రాణం పోయింది!!