
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి గురుచరణ్
విశాఖపట్నం, గాజువాక: పేదింటి బిడ్డకు ఖరీదైన జబ్బొచ్చింది. ముక్కుపచ్చలారని చిన్నారిని బ్లడ్ క్యాన్సర్ ఆవహించింది. ఆరోగ్యశ్రీతో వైద్యం పొందుదామని వెళ్లిన పేద కుటుంబానికి ఆస్పత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యశ్రీని నిలిపివేశారని, పది లక్షల రూపాయలు తెచ్చుకుంటేనే వైద్యం చేయగలమని స్పష్టం చేశారు. కూలి పనులు చేసుకొంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి ఈ దీనస్థితిని చూసి మౌనంగా రోదిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే..: పెదగంట్యాడలోని శీకువానిపాలేనికి చెందిన ఎ.అప్పలరాజు ఒక వాటర్ ప్లాంట్ నుంచి నీటి ప్యాకెట్లను తీసుకొని దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. అతడి మూడేళ్ల కుమారుడు గురుచరణ్ శరీరంపై గతనెల 30న ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. స్థానిక ఆస్పత్రిలో చూపించినప్పటికీ తగ్గకపోవడంతో 31న నగరంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు విజయ మెడికల్ ల్యాబ్‌లో రక్త పరీక్షలను చేయించారు. ఆ చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు తేలడంతో ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. తన బిడ్డకు వచ్చిన కష్టాన్ని వివరించి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డును డాక్టర్‌కు చూపించారు. ఈనెల 1 నుంచి ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని, అందువల్ల రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సమకూర్చుకోగలిగితే వైద్యం అందిస్తామని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్ చెప్పిన విషయంతో హతాశుడైన గురుచరణ్ తండ్రి అంత మొత్తాన్ని సమకూర్చుకోవడానికి దారిలేకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. దాతలు తనను ఆదుకోవాలని వేడుకొంటున్నాడు. తమ పట్ల దాతృత్వం చూపించే దాతలు ఎ.అప్పలరాజు, ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 30233740367, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0007087, ఫోన్ నంబర్ 9640100464లో సంప్రదించాలని ప్రాధేయపడుతున్నాడు.
స్థానికుల వితరణ: అప్పలరాజు కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తెలుసుకున్న స్థానికులు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. గురుచరణ్‌కు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకున్న స్థానిక లైఫ్ వే స్కూల్ కరస్పాండెంట్ నక్కా రమణ నేతృత్వంలో స్థానికులు చందాలేసుకొని రూ.1.60 లక్షలను బాధితుడి తండ్రికి అందజేశారు. దాతలు ముందుకొచ్చి చిన్నారి గురుచరణ్‌ను కాపాడాలని పాఠశాల కరస్పాండెంట్ ఈ సందర్భంగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment