ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): ఎంవీపీ కాలనీ సెక్టార్ – 7లోని క్యాన్సర్ ఆస్పత్రి వెనుకన ఉన్న సెల్లార్‌లో గుర్తు తెలియని పసికందు మృతదేహం లభ్యమయ్యింది. దీనిపై ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చిన రోజులు వెనుక ఉన్న సెల్లార్‌లో ఆశ్రయం పొందుతుంటారు. అయితే అక్కడ ఉన్న మరుగుదొడ్డి సమీపంలో ఆదివారం భారీగా దుర్వాసన వస్తుండటంతో ఆస్పత్రి పారిశుధ్య సిబ్బంది పరిశీలించారు. దీంతో చిన్న పిల్లాడి మృతదేహం బయటపడింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఏసీపీ మూర్తి, ఎస్‌ఐ భాస్కర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అంబులెన్స్‌లో కేజీహెచ్ మార్చురీకి శిశువు మృతదేహాన్ని తరలించారు.
దీనిపై ఎంవీపీ ఎస్‌ఐ భాస్కర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు మగ శిశువు మృతదేహాన్ని ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇది కేవలం క్యాన్సర్ చికిత్స ఆస్పత్రి కావడంతో గర్భిణులకు ఇక్కడ చికిత్స జరగదన్నారు. ఈ నేపథ్యంలో శిశువును ఇక్కడ ఎవరు విడిచిపెట్టారో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. శిశువును బ్యాగ్‌లో తీసుకొచ్చి ఇక్కడ విడిచి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఇటీవల ఎంవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో గర్భిణుల ప్రసవాలకు సంబంధించిన డేటా కూడా సేకరిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎవరికైనా వివరాలు తెలిస్తే 9440999804 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment