విలపిస్తున్న హర్ష తల్లి, బంధువులు
భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు...తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకున్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుని కష్టమేంటో తెలియకుండా పెంచారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగానే చదువుకుంటున్నారు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాలపై విధి కన్నెర్రజేసింది. నేలబావి రూపంలో ఉసురుతీసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బంధాన్ని తెంపేసింది. ఈత సరదా ఆకుటుంబాలను కన్నీటి పాల్జేసింది.
సాక్షి, పెదగంట్యాడ/అగనంపూడి (గాజువాక): ఆనందపురంలో సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హర్షశ్రీ సంతోష్, సాయి పవన్‌లు తరగతులు ముగిసిన తరువాత నీళ్లకుండీల వద్ద నేలబావిలో ఈత కొట్టేందుకు దిగి మృతి చెందారు. సాయిపవన్‌కు ఈత రాకపోవడం...రక్షించే క్రమంలో హర్షశ్రీ సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నిత్యం నవ్వుతూ కళ్లముందు తిరిగిన వీరిద్దరూ ఇప్పడు లేరన్న వార్తను తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తట్టుకోలేకపోతున్నారు. పెదగంట్యాడ సమీపంలోని చిననడువూరులోని రామాలయం వీధిలో సంతోషి కుటుంబ ఉంటోంది.
నర్సీపట్నానికి చెందిన మలసాల వెంకునాయుడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం పిల్లలతో సహా చిననడుపూరు వచ్చేశారు. వెంకునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడికి పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు హర్షశ్రీ సంతోష్ (17), చిన్నకుమారుడు నిరుపమ్. పెద్ద కుమారుడు పాలిటెక్నిక్, చిన్న కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. వెంకునాయుడు కుమారులిద్దరికీ ఉన్నత చదువులు చదివించాలని భావించాడు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది.
కన్నీరుమున్నీరుగా..
వడ్లపూడి నిర్వాసిత కాలనీ సంతమామిడితోట శివాలయం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కఠారి వెంకట సాయి పవన్ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పవన్ తండ్రి రాంబాబు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు సాయి పవన్ ఆనందపురంలోని ప్రైవేటు పాలిటెక్నిక్‌లో మొదటి సంవత్సరం డిప్లమో చేస్తున్నాడు. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన కుమారుడు తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఇంతలో మృతి చెందాడన్న విషాద వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
చదవండి: వివాహేతర సంబంధం: షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో..
Comments
Please login to add a commentAdd a comment