అరకులోయ రూరల్(విశాఖపట్నం): గోరుముద్దలు తినిపించిన ఆ చేతులే.. విషం కలిపి పెట్టాయా? జోల పాడి నిద్ర పుచ్చాల్సిన తల్లే పిల్లలను శాశ్వత నిద్రలోకి పంపిందా? భర్తతో విభేదాలను తట్టుకోలేక పిల్లల ప్రాణం తీసి.. బలవన్మరణానికి పాల్పడిందా? అక్కడి హృదయవిదారక దృశ్యాలను చూస్తే అలాగే అనిపిస్తోంది. అరకులోయ పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్ కాలనీలో వివాహిత, ఆమె ముగ్గురు బిడ్డలు శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ఆమె ముగ్గురు బిడ్డలు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు.
ఈ ముగ్గురు బిడ్డలను ఆస్పత్రికి తండ్రి తీసుకువెళ్లినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్ (10), కుమారులు సర్విన్ (8), సిరిల్(4)లతో కలిసి పాత పోస్టాఫీస్ కాలనీలో నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా మంచంపై విగతజీవులుగా ఉన్న ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో హుటాహుటిన ఏరియా అస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని సీఐ జి.డి.బాబు, ఎస్‌ఐ నజీర్ తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు.
ఎమ్మెల్యే పాల్గుణ విచారం
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హుటాహుటిన ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలు చూసి చలించిపోయారు. పాత పోస్టాఫీస్ వీధిలోని సంఘటన జరిగిన నివాసానికి కూడా వెళ్లి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment