నేడు బీఏసీ సమావేశం
Published Tue, Dec 17 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
భేటీలో తేదీ ఖరారయ్యాకే విభజన బిల్లుపై చర్చ
సీమాంధ్ర నేతలకు స్పీకర్ నాదెండ్ల స్పష్టీకరణ .. సభ తీరు నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య
ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ.. సాయంత్రం మండలి బీఏసీ
చర్చ మొదలైందన్న శ్రీధర్ తీరుపై సీమాంధ్ర నేతల అసంతృప్తి
ప్రసంగాన్ని పరిశీలించిన సీఎం, మంత్రులు
తెలంగాణ ముసాయిదా బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందా, లేదా అన్న అంశంపై పార్టీలకు అతీతంగా సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు, నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం సాగుతున్న నేపథ్యంలో... సభలో చర్చ ఇంకా ప్రారంభం కాలేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో తేదీని నిర్ణయించాకే దానిపై చర్చను చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారని తెలిసింది. ఈ వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు తదితర నేతలు స్పీకర్‌ను సంప్రదించారు. దాంతో ఆయన అధికారులతో సభ రికార్డులు పరిశీలింపజేశారని, చర్చ ప్రారంభం కాలేదని తేల్చారని సమాచారం. ‘‘బీఏసీ సమావేశంలో తేదీని నిర్ణయించాకే చర్చ ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బీఏసీని నిర్వహిస్తున్నాం’’ అని వారికి స్పీకర్ వివరించినట్టు సమాచారం.
అంతేగాక సోమవారం మధ్యాహ్నం సభలో జరిగినవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని కూడా ఆయన అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ మల్లు భటి ్ట విక్రమార్క సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించినప్పుడు ఆయన, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రసంగాలను కూడా కిరణ్, మంత్రులు పరిశీలించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభిస్తున్నట్టుగా కాకుండా, ‘బిల్లుపై చర్చను ప్రారంభించాలా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు తెలుసుకొనే రీతిలోనే’ సభ సాగిందని తేల్చారు. అంతేగాక బీఏసీని సమావేశపరచకుండానే చర్చను ఎలా చేపడతారని కూడా మంత్రులు ప్రశ్న లేవనెత్తారు.
దీనిపై శ్రీధర్‌బాబు తీరును పలువురు సీమాంధ్ర మంత్రులు తప్పుబట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ‘‘ముసాయిదా బిల్లుపై చర్చను చేపట్టే అంశంలో సభ్యులను డిప్యుటీ స్పీకర్ అభిప్రాయాలు అడిగారు. అందులో భాగంగానే శ్రీధర్‌బాబు మాట్లాడారు. బీఏసీ పెట్టి బిల్లుపై చర్చ తేదీని ఖరారు చేయాలని కూడా శ్రీధర్‌బాబే తన ప్రసంగంలో చెప్పారు. దీన్ని బిల్లుపై చర్చగా ఎలా భావిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. మంత్రి శైలజానాథ్ కూడా బిల్లుపై చర్చ జరిగిందనడాన్ని ఖండించారు. ‘‘చర్చ ఎక్కడ జరిగింది? కనీసం బిల్లును టేబుల్ చేయకుండానే చర్చను ఎలా ప్రారంభిస్తారు? బిల్లును ఈ రోజే ఇచ్చి, సభ్యులు చదవకుండానే చర్చను ప్రారంభిస్తారా? ఇదేం పద్ధతి?’’ అంటూ మండిపడ్డారు. మరోవైపు మంగళవారం సాయంత్రం శాసనమండలి బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement