
తారలు దిగివచ్చిన వేళ..
తిరునగరి శనివారం సినీ తారల సందడితో పులకించి పోయింది. స్థానిక ఎస్వీయూ క్రీడా మైదానంలో హాలీవుడ్ స్థాయిలో నిర్వహించిన బాహుబలి ఆడియో విడుదల కార్యక్రమానికి సినీ తారలు పోటెత్తారు. అభిమానుల కేరింతలు.. సినీ తారలు.. గాయకుల పాటలతో స్టేడియం హోరెత్తింది. భారీ సెట్టింగులతో.. సినిమా విజయోత్సవాన్ని తలపించింది. హీరో ప్రభాస్ అభిమానులు డార్లింగ్.. జపం అందుకున్నారు. సినీ దర్శకుడు రాజమౌళి.. అగ్ర తారాగణం తరలిరావడంతో తిరుపతి మొత్తం జాతరను తలపించింది.
- అట్టహాసంగా బాహుబలి ఆడియో విడుదల
- సినీ నటులను చూసి పులకించి పోయిన జనాలు
- తొక్కిసలాటతో విరిగిన బారికేడ్లు
- జనాలను అదుపు చేయలేక చేతులెత్తేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాహుబలి ఆడియో విడుదల వేడుక సూపర్ సక్సెస్ అయ్యింది. సాయం సంధ్యవేళ తారల సందడి.. అభిమానుల కేరింతలతో తిరుపతి నగరం పులకించి పోయింది. నగరంతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వైపు వెళ్లే దారులన్నీ జనాలతో కిక్కిరిశాయి.
అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాసులు ఉన్నవారు సైతం స్టేడియం లోపలికి వెళ్లలేక వెనుదిరాగాల్సి వచ్చింది. గేట్ల వద్ద తోపులాట జరిగింది. ఓ దశలో జనాలను అదుపు చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ తోపులాటలో మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది గేట్ల వద్దకు వెళ్లలేక అక్కడే కుప్పకూలిపోయారు.
సాయంత్రం 3 గంటల నుంచే జనాలు ఎస్వీయూ ఆడిటోరియంకు తరలి వచ్చారు. తమ అభిమాన నాయకుడు ప్రభాస్ వచ్చే సమయానికే స్టేడియం నలుమూలల ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. స్టేడియంలోకి వచ్చినవారు సినిమాలో నటించి తమ అభిమాన తార గణాన్ని చూసి పులకించి పోయారు. అభిమానుల హర్షధ్వానాలు కేరింతలతో స్టేడియం హోరెత్తింది. గీతామాధురి ,రేవంత్, కృష్ణచైతన్య బృందం అలాపించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలుగించాయి.
ఈ ఆడియో విడుదల వేడుకకు ప్రముఖ వ్యాఖ్యాత సుమ యాంకరింగ్ చేశారు. సినిమాలోని ప్రతి పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. వారు తమ అభిమానులద్దేశించి మాట్లాడే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ వారికి తమ మద్దతు తెలపడం విశేషం. సినిమా డెరైక్టర్ రాజమౌళి సినిమాలోని పాత్రల ప్రాధాన్యతను వివరించారు. తమ సినిమాలో విలన్ క్యారక్టర్‌లు పవర్ పుల్‌గా ఉంటాయని చెప్పారు. సినిమా తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.
ఆడియో విడుదల వేడుకకు కోట్ల ఖర్చు
ఎస్వీయూ ఆడిటోరియంలో ఆడియో విడుదల వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. పటిష్టమైన బారికేడ్లను, పెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకులు రాజమౌళి శుక్రవారం నుంచి తిరుపతిలో మకాం వేసి, ఏర్పా ట్లలను స్వయంగా పరిశీలించారు. ప్రధానద్వారం వద్ద పెద్ద,పెద్ద ఆర్చిలను ఏర్పాట్లు చేశారు. సుమారు వెయ్యి మందికి పైగా సినీ ప్రముఖులు ఆడియో విడుదల వేడుకకు తరలివచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరికి స్టార్ హోటళ్లలో వసతి, భోజనానికి సంబంధించి భారీగా ఖర్చు చేసినట్లు సమచారం.
తొలిసారి ఆడియో విడుదల వేడుక తిరుపతిలో నిర్వహించిన నేపథ్యంలో స్టేడియంలో ఏర్పాట్ల కోసం రూ.కోటికిపైగా ఖర్చు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా అయినందున ఆడియో విడుదల వేడుకకు అదే రీతిలో భారీగా ఖర్చు చేసేందుకు నిర్మాత వెనుకాడనట్టు సమచారం. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి త్వరలో విడుదలైయ్యే సినిమాకు భారీ ప్రచారం వచ్చేలా ప్రణాళిక రూపొందించి, డబ్బు వెదజల్లినట్టు సమచారం. సభ నిర్వహణకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ప్రైవేటు సైన్యాన్ని భారీగా తరలి వచ్చారు. లైటింగ్ డెకరేషన్ అద్భుతంగా చేశారు.