భక్తిశ్రద్ధలతో బక్రీద్
శ్రీకాకుళం కల్చరల్:బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలోని జీటీ రోడ్డులో ఉన్న జామియా మసీదులో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీదుకు చెందిన ముఫ్తీ మెహతాబ్ ఆలం మాట్లాడుతూ మంచికి, మానవత్వానికి చిహ్నంగా మహ్మద్ ప్రవక్త నిలుస్తాడన్నారు. పరమత సహనం కలిగి ఉండాలని, శాంతి సామరస్యాలు పెంపు చేయాలని హితవు పలికారు.
ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ముబారక్ చెప్పుకున్నారు. కార్యక్రమంలో సుల్తాన్, మాజీ అధ్యక్షులు ఎంఎ రఫీ, సభ్యులు షాన్, మహ్మద్, జిలాని, బాషా, మదీనా, సలాని, మహీబుల్లా ఖాన్, వైఎస్‌ఆర్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర సభ్యుడు అబ్దుల్ రహమాన్, అజ్‌గర్ ఆలీబేగ్, బహదూర్ జానీ, ఎం.సిరాజుద్దీన్ గౌస్, అబ్దుల్లా భాషా తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వెనుకనున్న సిద్దిక్ నేషనల్ మసీదులో ముస్లిం పురుషులతో పాటు మహిళలు నమాజు చేశారు. మసీదు ముఫ్తీ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు హర్షద్, ఇలియాస్, ఖాదర్ హాజీ, జిలానీ, అమీన్, ఆజాద్, ఆలి, రియాజ్, ఎస్.ఆలం తదితరులు పాల్గొన్నారు.