ఒంగోలు, న్యూస్‌లైన్: అసెంబ్లీ, పురపాలక ఎన్నికలు ఏవి ముందొచ్చినా..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అన్ని అర్హతలున్నవారినే గుర్తించి ఓటర్లుగా చేర్పించాలని వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి నగర పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు నగర స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలనుద్దేశించి బాలినేని మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. కేవలం తనను లక్ష్యంగా చేసుకుని అర్హులైన 40 వేల ఓట్లను దొంగ ఓట్ల పేరుతో ప్రభుత్వం తొలగించిందన్నారు. 40 వేల దొంగ ఓట్లను చేర్చుకోగలిగే సత్తా తనకే ఉంటే దేశంలో ఎక్కడైనా పోటీ చేసి సునాయాసంగా గెలవవచ్చన్నారు. శివారు ప్రాంతాలు, దళితవాడలనే లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగించారని, వారంతా తమ ఓట్లు తొలగించారని చెబుతుంటే చాలా బాధ కలిగిందని బాలినేని పేర్కొన్నారు. మనం చేసిన మంచే మనల్ని గెలిపించిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
నిజమైన ఓటర్లను చేర్పించేందుకు బూత్ కమిటీలు పటిష్టంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులున్నారని, వారు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఆదివారం అందుబాటులో ఉంటారని, లేనిపక్షంలో బూత్‌లెవల్ కమిటీ సభ్యులు, అభ్యర్థుల దరఖాస్తులను సంబంధిత బూత్‌లెవల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అందజేయడంతో పాటు తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. పదిహేను రోజులు బాగా కష్టపడండి..ఆ తరువాత మీ కోసం నేను కష్టపడతా అని బాలినేని కోరారు. తాను కుటుంబం కన్నా..కార్యకర్తల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటానని, కార్పొరేషన్లను గెలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు కూడా బూత్ కమిటీలు వేసుకుని ఇందుకు సిద్ధం కావాలని బాలినేని పిలుపునిచ్చారు.
జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ వాసన్న రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నందున పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, నాయకుడు నూతన ఓటర్లను చేర్పించే బాధ్యతను స్వీకరించాలన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశం విషయాలను బాలాజీ వివరించారు. బూత్‌ల వారీగా ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలున్నాయనే వాటిని గుర్తించి బాలినేని దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీలు ఇష్టారీతిగా దుష్ర్పచారం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలన్నారు.
నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలినేని చేసిన అభివృద్ధి గురించి విసృ్తతంగా ప్రచారం చేయాలన్నారు. కనీసం ఎమ్మెల్యే తెచ్చిన నిధుల్ని సైతం వినియోగించుకోకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న అధికార పార్టీ నాయకుల చర్యలను, వారికి వత్తాసు పలుకుతున్న టీడీపీ నాయకుల చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధులు కొఠారి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరశింగరావు, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు కఠారి శంకర్, వేమూరి బుజ్జి, పోకల అనూరాధ, కంచర్ల సుధాకర్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, షేక్ ఖాజా, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల నగర కన్వీనర్లు నెరుసుల రామకృష్ణ, బొప్పరాజు కొండలరావు, యరజర్ల రమేష్, ముదివర్తి బాబూరావు, కావూరి సుశీల, కంకణాల వెంకట్రావు, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, పార్టీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కత్తినేని రామకృష్ణారెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, ఎస్‌వీ రమణయ్య, జమ్ము రత్తయ్య, జాజుల కృష్ణ, వెలనాటి మాధవరావు, ప్రసాదరెడ్డి, రాయని వెంకట్రావు పాల్గొన్నారు.
అర్హులనే ఓటర్లుగా చేర్పించండి: బాలినేని శ్రీనివాసరెడ్డి
Published Mon, Nov 25 2013 6:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement