విద్యార్థి ఓటర్ చూపుడు వేలిపై సిరాతో చుక్క పెడుతున్న ఉపాధ్యాయిని
సాక్షి, వేపాడ (శ్రీకాకుళం) : ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆదర్శ పాఠశాలలో సోమవారం రహస్య ఓటింగ్ పద్ధతిలో పాఠశాల విద్యార్థి నాయకుడ్ని ఎన్నుకున్నారు. విద్యార్థులను ఆకట్టుకున్న ఈ కార్యక్రమం వేపాడ సమీపంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. పాఠశాల విద్యార్థి నాయకుడు ఎన్నికను రహస్య బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ విద్యార్థులంతా రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పాఠశాల విద్యార్థి నాయకుడు పదవికి (ఎస్‌పీఎల్) ఎం.ఎర్నాయుడు, జె.జగదీష్, జి.కన్నంనాయుడు, ఐ.చైతన్య పోటీ చేశారు. పీజీటీ, టీజీటీలైన పి.శివప్రసాద్, జె.అప్పారావు, ఎన్.హైమ, ఎస్‌కే పర్వీన్‌బేగం ఆధ్వర్యంలో మూడు బూత్‌లను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులను బూత్ అధికారులుగా నియమించారు.
ఓటింగ్ అనంతరం ఓట్లు లెక్కించగా జి.కన్నంనాయుడు 213 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో, 182 ఓట్లు సాధించిన ఎం.ఎర్నాయుడు రెండోస్థానంలో నిలిచారు. దీంతో పాఠశాల ఎస్‌పీఎల్‌గా జి.కన్నంనాయుడు, వైస్ ఎస్‌పీఎల్‌గా ఎం.ఎర్నాయుడులను విజేతలుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. విజేతలను ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఓటింగ్ పద్ధతిలో విద్యార్థి నాయకుడిని ఎన్నుకోవటంతో ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగంపై అవగాహన కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య ఎన్నికలపై అవగాహన కల్పించి చైతన్యపరిచేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment