‘రాయల’పై లడాయి | Bandh against Rayala Telangana | Sakshi
Sakshi News home page

‘రాయల’పై లడాయి

Published Thu, Dec 5 2013 3:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Bandh against Rayala Telangana

రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు హోరెత్తాయి. రాయలను ఎవరూ కోరుకోవడం లేదని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్నే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యార్థులు మానవహారాలు నిర్వహించి పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఆమోదయోగ్యమని చాటారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీలు తీశారు.
 - సాక్షి, కరీంనగర్
 
 సాక్షి, కరీంనగర్ :కేంద్రమంత్రుల బృందం రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడాన్ని నిరసిస్తూ జిల్లా అంతటా ఆందోళనలు జరిగాయి. జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఆయా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, అసంఘటిత కార్మికులు, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ, ఏఐఎస్‌ఎఫ్, ఆర్టీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రధాన చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.
 
 ఓసీపీ-3 ఏరియా వర్క్‌షాప్ తెలంగాణ చౌరస్తాలో టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులు, టీఆర్‌ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. మెట్‌పల్లిలో బీజేవైఎం నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపా రు. రాయల తెలంగాణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ జగిత్యాల ఏరియా ఆస్పత్రి వైద్యులు మండిపడ్డారు. ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్ ఎదుట టీఆర్‌ఎస్ కార్యకర్తలు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అల్గునూర్ చౌరస్తాలో మానవహా రం నిర్వహించారు. సిరిసిల్లలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
 
 బంద్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు
 రాయల తెలంగాణ ప్రతిపాదనను విరమించుకోవాలనే డిమాండ్‌తో జేఏసీ, టీఆర్‌ఎస్ గురువారం పిలుపునిచ్చిన బంద్‌కు విసృ్తత మద్దతు లభిస్తోంది. బీజేపీ, సీపీఐలు మద్దతు ప్రకటించాయి. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వృత్తి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని టీఎన్జీవోస్ నాయకులు నిర్ణయించారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ గురువారం నాడు సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది. బంద్‌ను విజయవంతం చేసే దిశగా టీఆర్‌ఎస్, జేఏసీలు సన్నాహాలు చేస్తున్నాయి. సంపూర్ణ బంద్‌తో ప్రజల ఆకాంక్షను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement