‘బంగారు తల్లి’కి పురిటి నొప్పులు
కొవ్వూరు రూరల్ : బంగారుతల్లి పథకం పేద కుటుంబాలకు అం దని ద్రాక్షలా మారింది. పేద కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లిదండ్రులకు బంగారుతల్లి పుట్టిందనే భావన తీసుకురావాలనే లక్ష్యంతో 2013 మే 1నుంచి ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లికి ఈ పథకం వర్తిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అయితే, పథకం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ పథకంలో పేర్లు నమోదు చేయించుకునేందుకు బిడ్డ జనన ధ్రువీకరణ, ఆధార్ నమోదు, బ్యాంక్ అకౌంట్ల కోసం బాలింతలు కాళ్లరిగేలా తిరిగారు. పథకం ప్రారంభమై ఏడాది దాటినా ఎలాంటి ప్రగతి లేకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పురిట్లోనే పడకేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
8,500 మంది తల్లుల ఎదురుచూపు
బంగారు తల్లి పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 15,192 మంది తల్లులు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం అన్ని పత్రాలను అందించి పేర్లు నమోదు చేయించుకున్నారు. కాగా, వీరిలో సుమారు 6,700 మందికి చెందిన బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే నగదు జమ అయ్యింది. ఇంకా సుమారు 8,500 మందికి పైగా లబ్ధి చేకూరాల్సి ఉంది. కొవ్వూరు మండలంలో ఈ పథకం కోసం 347మంది తల్లులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకూ 154మందికి మాత్రమే ఆర్థిక సాయం అందింది.
ప్రోత్సాహకం ఇలా
బంగారు తల్లి పథకం నిబంధనల ప్రకారం గర్భిణి ప్రభుత్వాస్పత్రిలో పురుడు పోరుుంచుకోవాలి. ఆమెకు ఆడబిడ్డ పుడితే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఈ విషయం ధ్రువీకరించగానే ఆ బిడ్డ తల్లి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 2,500 జమ అవుతుంది. అనంతరం బిడ్డ వయస్సు పెరిగేకొద్దీ ఏటా ఇచ్చే ఈ మొత్తం పెరుగుతుంది. రెండేళ్లలోపు బిడ్డకు రూ.2 వేలు, 3 నుంచి 5 ఏళ్ల మధ్య రూ.4,500, 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య రూ.10వేలు, 6 నుంచి 8వరగతి మధ్య రూ.7,500, 9, 10తరగతులకు రూ.6వేలు, ఇంటర్మీడియెట్‌లో చేరాక రూ.7వేలు, డిగ్రీలో చేరాక రూ.16వేలు, డీగ్రీ పాసైన యువతికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. బిడ్డకు 21ఏళ్లు నిండి ఇంటర్ ఉత్తీర్ణురాలైతే రూ. 50 వేలు, డిగ్రీ పాసైతే రూ.లక్ష ఒకేసారి ప్రోత్సాహకం అందుతుంది. జిల్లాలో ఇప్పటివరకూ ఇప్పటివరకూ 6,700 మంది లబ్ధిదారుల అకౌంట్లలో బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే రూ.2,500 చొప్పున మాత్రమే జమ అయ్యూయి. 1-2 ఏళ్ల మధ్య ఇవ్వాల్సిన రూ.2 వేలు నేటికీ అందలేదు. మరోవైపు సుమారు 8,500 మంది లబ్ధిదారుల అకౌంట్లలో ఒక్క పైసా కూడా జమ కాలేదు.
సాయం అందలేదు
నాకు ఆడబిడ్డ పుట్టి సుమారు 10నెలలు అవుతోంది. బంగారుతల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకూ ఆర్థిక సాయం అందలేదు.
-కంచర్ల సుమతి, మద్దూరులంక
దరఖాస్తు ఇచ్చి 8 నెలలైంది
అమ్మాయి పుడితే బంగారు తల్లి పథకంలో ఆర్థిక సాయం అందుతుందని చెబితే దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికి 8 నెలలు కావస్తోంది. ఎటువంటి సొమ్ములు అందలేదు.
-పచ్చిపాల స్వాతి, నందమూరు
సాయం ఎప్పుడు అందుతుందో
నాకు పాప పుట్టి 8 నెలలు కావస్తోంది. ఇప్పటికీ బంగారు తల్లి పథకం కింద బ్యాంక్ అకౌంట్‌లో సొమ్ము జమకాలేదు. ఆ డబ్బు అందితే మా వంటి పేదవారికి ఎంతో ఉపయోగపడుతుంది.
-కొమ్మిరెడ్డి దుర్గ, నందమూరు