కాపులను బీసీల జాబితాలో చేర్చాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం స్వచ్ఛమైనదని,
తుని : కాపులను బీసీల జాబితాలో చేర్చాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం స్వచ్ఛమైనదని, దీనికి రాజకీయాలు అపాదించరాదని కాకినాడసిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు. కాకినాడ మాజీ కార్పొరేటర్లు, బీసీ, ఎస్సీ, మైనారిటీ నాయకులతో కలసి చంద్రశేఖర రెడ్డి ర్యాలీగా తుని మండలం వి.కొత్తూరు కాపు ఐక్యగర్జన సభాస్థలికి వచ్చారు. ముద్రగడను కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరిస్తే మిగిలిన వారికి నష్టం ఉండదని, ఎందుకంటే రిజర్వేషన్ శాతాన్ని పెంపుదల చేస్తారన్నారు.‘‘కులాలకు అతీతంగా మేమంతా వచ్చాం. పార్టీ పరంగా నేను ఇక్కడకు రాలేదు. ముద్రగడ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న స్నేహం వల్ల వచ్చాను’’ అని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి ఆశోక్, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, అల్లు రాజబాబు పాల్గొన్నారు.