సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖర్లో లేదా వచ్చేనెల మొదటి వారంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని, ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ రూట్ మ్యాపులు, చార్టులతో సిద్ధంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో టాయిలెట్లు, ర్యాంపులు, ఫర్నిచర్, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంత పోలింగ్ కేంద్రంలో 1300కుపైగా, పట్టణ ప్రాంతాల్లో 1600కుపైగా ఓటర్లుంటే అనుబంధ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని,ఇందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. గతంలో అతి తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాల పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చంపాలాల్, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్వీఎం పీఓ కిషన్‌రావు, ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి
Published Sat, Feb 8 2014 12:00 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement