పదవి కొట్టు.. పార్టీ ఆఫీసు కట్టు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం నామినేటెడ్ పోస్టులను అధికార పార్టీ ఎరగా చూపుతోంది. నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న నేతలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను కట్టించాలనే షరతు విధిస్తున్నారు. ఈ షరతును అంగీకరించిన నేతలకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ ముఖ్యులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సి కూడా వస్తోందని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి నుంచి కష్టపడ్డ తమకు అన్యాయం జరుగుతోందని కార్యకర్తలు వాపోతున్నారు.
అంత ఖర్చా... భరించలేం!
వాస్తవానికి కర్నూలు మార్కెట్ చైర్మన్ పోస్టుకు మొదటి నుంచి జిల్లాలో ప్రధాన వర్గానికి చెందిన నేత ఒకరు ప్రయత్నించారు. దాదాపు ఈయనకే కర్నూలు మార్కెట్ చైర్మన్ పోస్టు ఖరారైందన్న ప్రచారమూ జరిగింది. అయితే.. కర్నూలు జిల్లా ప్రధాన కేంద్రంలో మూడంతస్తుల పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంతో పాటు అదనంగా మరికొంత ముట్టచెప్పాలని నేతలు చెప్పడంతో ఆయన కాస్తా విస్తుపోయారు. అంతేకాకుండా కేవలం ఒకే ఏడాది పదవీకాలం ఉండటంతో.. అంతమొత్తాన్ని సంపాదించడం కష్టమని ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నారు. చివరకు ఈ షరతులకు ఒప్పుకున్న వారికే పదవులు దక్కాయని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
జంప్‌జిలానీలకు షాక్...!
ఇప్పటివరకు నాలుగు మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. మరో మార్కెట్‌కు త్వరలో నియామకం జరగనుంది. మిగిలిన మార్కెట్ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగం పుంజుకుంటోంది. అయితే, ఏ నామినేటెడ్ పోస్టు కూడా ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన తాజా మాజీ కాంగ్రెస్ నేతలు సిఫారసు చేసిన వ్యక్తులకు దక్కే సూచనలు కనిపించడం లేదు.
దీంతో మాజీ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ప్రాంతాల్లో.. వీరు సిఫారసు చేసిన పేర్లను కాకుండా పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీరు కూడా పార్టీ కార్యాలయాల నిర్మాణంతో పాటు అంతో ఇంతో ముట్టచెప్పాల్సిందేనని ఆ పార్టీ ముఖ్యనేతలు కరాఖండిగా చెబుతుండటం విశేషం.