
బీ‘హార్రర్’
దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం.. బీహార్ వాళ్ల ప్రవర్తన అమానుషం.. రైల్వే పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు’ అంటూ కాశీ యాత్రకు వెళ్లిన భీమవరం
భీమవరం క్రైం:‘దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం.. బీహార్ వాళ్ల ప్రవర్తన అమానుషం.. రైల్వే పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు’ అంటూ కాశీ యాత్రకు వెళ్లిన భీమవరం ప్రాంత వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. వారణాసి తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడ్డ 30 మంది భీమవరం పరిసర ప్రాంత వాసులు సోమవారం క్షేమంగా ఇక్కడకు చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరిని రిజర్వేషన్ చేయించుకున్న భోగీలను ఎక్కనివ్వకుండా బీహార్ విద్యార్థులు రైలు నుంచి కిందికి తోసివేశారు. వీరంతా గత నెల 22న భీమవరం నుంచి వారణాసి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో 26వ తేదీన పాట్నా-సికింద్రాబాద్ రైలుకు రిజర్వేషన్ చేయించుకున్నారు.
అయితే సికింద్రాబాద్‌లో రైల్వే పరీక్షలు రాసేందుకు వెళుతున్న బీహార్ విద్యార్థులు బెర్తులను ఆక్రమించి వారణాసిలో యాత్రికులను అడ్డుకున్నారు. కొందరిని రైలు నుంచి కూడా కిందకు తోసేశారు. రైలు కదిలిపోవడంతో యాత్రికులు రెండు రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. రైల్వే అధికారులు జూన్ 28న టికెట్లు కేటాయించడంతో వీరంతా వారణాసి నుంచి ఆదివారం కోల్‌కతా వచ్చి అక్కడి నుంచి సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో భీమవరం జంక్షన్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. బీహార్ వాసులు రాళ్ల దాడిలో చాలా మంది తెలుగు వారికి గాయాలయ్యాయి. భీమవరం స్టేషన్ వద్ద యాత్రికుల కుటుంబ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.