మృతి చెందిన కొండబాబు
సాక్షి, ఉయ్యూరు (కృష్ణా): భిక్షమేయని పాపానికి ఓ యాచకుడు అతి కిరాతకంగా వ్యవహరించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ఉయ్యూరు పట్టణంలో సంచలనమైంది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరులోని కూనపరెడ్డినగర్‌కు చెందిన చిలకా కొండబాబు (50), అతని భార్యతో కలిసి బస్టాండ్ ఆవరణలోని రైతు బజారులో పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తాడు. అదే రైతు బజారు, బస్టాండ్ ప్రాంతంలో పట్టణ శివారు నాగన్నగూడెంకు చెందిన గుంజా అశోక్‌బాబు యాచన చేస్తూ జీవనం సాగిస్తాడు. భోజన సమయంలో మంగళవారం మధ్యాహ్నం భార్యను బండి వద్ద ఉంచి కొండబాబు భోజనం చేసి కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు బస్టాండ్‌లోని ఫ్యాను కిందకు వెళ్లి నేలపై సేద తీరుతున్నాడు. రైతు బజారులో యాచన చేస్తూ అదే క్రమంలో బస్టాండ్‌లోకి వెళ్లి కొండబాబును ఓ ఐదో, పదో ఇవ్వమని అడిగాడు.
ఇరువురూ అక్కడే కొంత కాలంగా పరిచయస్థులు కావడంతో నా దగ్గర లేవు, ఎక్కడైనా వెళ్లి తీసుకో.. అని కొండబాబు బదులిచ్చాడు. బస్టాండ్‌లో ప్రయాణికుల వద్దకు వెళ్లినా ఎవ్వరూ ఇవ్వకపోవడంతో తిరిగి మళ్లీ కొండబాబు దగ్గరకే వచ్చి బిచ్చమడిగాడు. దీంతో కొండబాబు ‘ఏవయ్యా, నా దగ్గర లేవన్నానా, అడుక్కోకపోతే పని చేసుకోవచ్చు కదా, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావ్’’ అని అనడంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. దీంతో కోపోద్రిక్తుడైన అశోక్‌బాబు ఒక్కసారిగా కొండబాబు మెడ పట్టుకుని ఉరిమి చేతులతో దాడి చేసి బలంగా బాదడంతో నోటి నుంచి రక్తం కక్కుకుని అక్కడికక్కడే క్షతగాత్రుడు కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గురుప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
చోద్యం చూస్తూ..
పట్టపగలు తమ కళ్ల ముందే అకారణంగా ఓ వ్యక్తి మరొకరిపై దాడి చేసి కొట్టి చంపుతుంటే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. బస్టాండ్‌లో జనం ముందే కొట్టి చంపుతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా చోద్యం చూడటంపై పోలీసులు నివ్వెరపోయారు.
Comments
Please login to add a commentAdd a comment