- గో సంఘం వద్ద భూమి కేటాయింపునకు రంగం సిద్ధం
- రూ. 150 కోట్లతో అధునాతన కంపెనీ నిర్మాణం
మచిలీపట్నం : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)కు 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మచిలీపట్నంలోని దేశాయిపేట సమీపంలో ఉన్న గో సంఘంలో 25 ఎకరాల భూమిని బెల్ కంపెనీకి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం కుదిరింది. భూమిని అప్పగిస్తే రూ.150 కోట్లతో కంపెనీని విస్తరించనున్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బెల్ కంపెనీని ఇక్కడ నిర్మించనున్నారు. మూడేళ్ల క్రితం ఈ కంపెనీని మచిలీపట్నం నుంచి గన్నవరం తదితర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దీన్ని మచిలీపట్నంలోనే ఉంచాలనే డిమాండ్ వచ్చింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్ ఎస్‌ఏఎం రిజ్వీ కంపెనీకి మచిలీపట్నంలోనే భూమి కేటాయించేందుకు కసరత్తు చేశారు. గో సంఘంలోని 25 ఎకరాల భూమిని అప్పట్లో రాజీవ్ గృహకల్ప పథకానికి కేటాయించారు.
ఇప్పుడు బెల్‌ను విస్తరించేందుకు భూమి అవసరం అవడంతో బెల్ కంపెనీ అధికారులను తీసుకొచ్చి భూమిని చూపించారు. కంపెనీ నిర్మించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే గోసంఘం భూమిని బెల్ కంపెనీకి ఇవ్వకూడదంటూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించి క్లియరెన్స్ రావడంతో రెవెన్యూ అధికారులు బెల్ కంపెనీకి గో సంఘంలోని 25 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.