పాలకొండ: ప్రభుత్వం తమను మోసగించిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితులను ఆదుపు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అరెస్టులతో ప్రధాన రహదారి దద్దరిల్లింది. వివరాలు పరిశీలిస్తే... తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజులగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం డివిజన్ పరిధిలోని వేలాది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆర్డీవో కార్యాలయం ముట్టడికి సన్నద్ధమయ్యారు.
కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఉద్యోగులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటికే డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ మోహరించారు. ఆదే సమయంలో కార్యాలయానికి చేరుకున్న ఆర్డీవో కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తలంతా ఆయనను చుట్టు ముట్టడంతో సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం అంగన్‌వాడీలు ఆందోళన తీవ్రతరం చేశారు.
ప్రధాన రహదారిని దిగ్భందించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. మరోపక్క రోడ్డుకు ట్రాఫిక్ నిలిచిపోవడడంతో అంగన్‌వాడీ నాయకులను, వారికి సహకరిస్తున్న సీఐటీయూ నాయకులు 30 మందిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అప్పటికీ శాంతించని అంగన్‌వాడీలు పోలీసు స్టేషన్‌కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీగా వెళ్లారు. సి ఐ వేణుగోపాలరావు, ఎస్ ఐ ఎల్. చంద్రశేఖర్‌లు వీరికి సర్దిచెప్పి అరెస్టు చేసిన వారికి సొంత పూచీ కత్తులతో విడిచి పెట్టారు.
శ్రీకాకుళంలో 650 మంది అరెస్టు
పీఎన్ కాలనీ (శ్రీకాకుళం) : తమ డిమాండ్లు పరిష్కారించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించక పోతే ఆందోళనను ఉద్ధృ చేస్తామన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్దకు భారీగా అంగన్‌వాడీలు చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు మొహరించాయి.
సీఐటీయు నాయకులు, అంగన్‌వాడీలతో పోలీసులు వాగ్వావాదానికి దిగారు. దీంతో పోలీసులు 650 మంది అంగన్‌వాడీలను అరెస్టు చేసి 1వ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వీరిని సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు, అంగన్‌వాడీలు ఈ నెల 17న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సీఐటీయూ డి. గణేష్, కె. నాగమణి, అంగన్‌వాడీ ప్రతినిధులు కె. కళ్యాణి, హిమబిందు, లక్ష్మి పాల్గొన్నారు.
గర్జించిన అంగన్‌వాడీలు
Published Sat, Mar 14 2015 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement