విజయవాడ : సమస్యలు పరిష్కరించాలని కోరినవారిపై ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు కొద్దిరోజులుగా దశలవారీగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కొనసాగింపుగా మంగళ, బుధవారాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో రెండొందల మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలను సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అదుపులోకి తీసుకున్నారు.
వాహనాల్లో తరలివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారిని అంగన్‌వాడీ కేంద్రాల వద్ద మాటువేసి సాయంత్రానికి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారినుంచి పూచీకత్తు తీసుకుని, హైదరాబాద్ వెళ్లబోమని రాయించుకొని వదిలిపెట్టారు. మచిలీపట్నం, పెడన, హనుమాన్‌జంక్షన్, గన్నవరం, నూజివీడు, ఆగిరిపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయమే కొందరు అంగన్‌వాడీ సిబ్బంది హైదరాబాద్ తరలివెళ్లగా, వారి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐటీయూ జిల్లా నాయకులు తెలిపారు.
పెడన, కృత్తివెన్నుల్లో నిరసన
పెడన, కృత్తివెన్ను మండలాల్లో అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీలు ఆందోళనలకు దిగారు. పెడన మండలంలో దాదాపు 60 మంది కార్యకర్తలు, ఆయాలు సోమవారం రాత్రి 8.45 గంటల రైలుకు హైదరాబాదు వెళ్లేందుకు సిద్ధమవగా, పోలీసులు సంఘ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సుమారు 50 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కైకలూరు నియోజ కవర్గ నేత ఉప్పాల రాంప్రసాద్ పార్టీ నేతలతో కలిసి స్టేషన్‌కు వచ్చి అంగన్‌వాడీలకు మద్దతుగా బైఠాయించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కృత్తివెన్నులోనూ పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీలు ఆందోళన చేశారు.
అంగన్‌వాడీల అక్రమ నిర్బంధం
Published Tue, Mar 17 2015 4:18 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement