హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న అంగన్‌వాడీలను వాహనంలో తరలిస్తుండగా కింద పడిపోయిన ఓ మహిళ
ప్రభుత్వ దమనకాండపై పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు,రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం
నిర్బంధాలను దాటుకుని హైదరాబాద్‌లో ఉద్యమించిన అంగన్‌వాడీలు
అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టు
సాక్షి, విజయవాడ బ్యూరో: జీతాల పెంపుతో సహా తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన అంగన్‌వాడీలపై ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మంగళవారం ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహజ్వాలలు వెళ్లగక్కారు. నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి ప్రభుత్వ, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ప్రభుత్వం బెదిరింపు ధోరణులు విడనాడాలని, అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో అంగన్‌వాడీల అరెస్టులను నిరసిస్తూ అందోళనకు దిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటరమణ, రాంరెడ్డి ప్రతాపరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.