కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు గర్జించారు. కలెక్టరేట్‌ను ము ట్టడించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. గేట్లు దాటుకొని కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐటీయూ అనుబంధ సంస్థ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు వందల సంఖ్యలో శుక్రవారం కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడ ధర్నా చేశారు. తీక్షణమైన ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా సమస్యల పరిష్కారం కోసం భీష్మించి కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి పుల్లారెడ్డి, కార్యదర్శులు నరసింహ, సుబ్బయ్య, పాణ్యం డివిజన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ. 12,500 కనీస వేతనం ఇవ్వాలని, పెన్షన్‌తో సహా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఐకేజీ జోక్యాన్ని నివారించాలన్నారు. అమృత హస్తం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. మహిళలు నినాదాలు చేస్తూ సుమారు రెండున్నర గంటల సేపు కూర్చున్నా అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో ఒకానొక దశలో గేట్లు తోశారు. పోలీసులు అడ్డగించడంతో చిన్నగేటులోంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు గేట్లెక్కి అవతలికి దూకారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఏర్పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చివరికి ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ వచ్చి సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో మహిళలు శాంతించారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, ఆయకర్‌రావు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు సావిత్రి, శ్యామల, మంజుల, శారద, రాజ్యలక్ష్మి, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.
కేసు నమోదు
కర్నూలు, న్యూస్‌లైన్: కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన సీఐటీయూ నాయకులపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సబ్ డివిజన్ పోలీసు అధికారి అనుమతి లేకుండా 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ ఆందోళనకారులు కలెక్టరేట్ గేట్ ఎక్కి లోపలికి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించడంతో అడ్డుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు కలెక్టరేట్ వద్ద 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే ఖచ్చితంగా కర్నూలు డీఎస్పీ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద సందర్శకులకు అంతరాయం కలిగించినందుకు సీఐటియు నాయకులు పుల్లారెడ్డి, నాగేశ్వరరావు, నరసింహా, నాగరాజుతో పాటు మరికొంతమందిపై ఐపీసీ 143, 188, 343, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గర్జించిన అంగన్‌వాడీలు
Published Sat, Feb 22 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement