కప్పం కట్టు... బెల్టు షాపు పెట్టు
బెల్టుషాపు నిర్వహణకు వేలంపాట
రూ. 1.53లక్షలకు దక్కించుకొన్న ఆమ్మకం దారుడు
చక్రం తిప్పుతున్న టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి
కె.కోటపాడు మండలం సూదివలసలో బాగోతం ఇదీ
‘గ్రామంలో బెల్టు షాపు కేటాయించేందుకు వేలంపాట నిర్వహిస్తున్నారహో!... ఆసక్తి ఉన్న వారు పాటలో పాల్గొనండి. ఎక్కువ మొత్తానికి పాడినవారు ఏడాదిపాటు దర్జాగా నడుపుకోవచ్చహో!’ ఇదీ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. అదేమిటీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు కదా అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఎన్నికలు అయిపోయాయి కదా. ఇప్పుడు హామీలతో పనేమిటని టీడీపీ నేతలు భావిస్తున్నట్టున్నారు. బరితెగించేసి బెల్టు షాపుల ఏర్పాటుకు గ్రామాల్లో దండోరా వేసి మరీ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ని లుస్తున్న కె.కోటపాటు మండలం సూదివలసలో ప్రస్తుత పరిస్థితి ఇదీ...
కె.కోటపాడు: మండలంలోని సూదివలసలో ఓ స్థానిక ప్రజాప్రతినిధికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది. ప్రభుత్వం మద్యం దుకాణాలను టెండర్లు పిలుస్తోంది కదా! తాను బెల్టు షాపునకు ఎందుకు అలా చేయకూడదు అని భావించారు. అధికారిక మద్యం దుకాణానికి అయితే ప్రభుత్వానికి డిపాజిట్టు చెల్లిస్తారు. అదే బెల్టు షాపునకు అయితే తనకు కప్పం కడతారు కదా అని ఆశించారు. అనిపించిందే తడవుగా గ్రామంలో బెల్టు షాపు కేటాయింపునకు వేలం కోసం గ్రామంలో దండోరా వేయించారు. ఆసక్తి ఉన్నవారు వేలం పాటలో పాల్గొనవచ్చని చాటించారు. అనుకున్న విధంగానే ఈ నెల 16న గ్రామంలోని రచ్చబండ సాక్షిగా వేలంపాటను నిర్వహించారు. పదిమందికిపైగా పాల్గొన్న ఆ బహిరంగ వేలంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి రూ.1,50,500కు పాటపాడుకున్నారు. ఆ మొత్తాన్ని ఈ నెల 21న చెల్లించాలని ఆ ప్రజాప్రతినిధి గడువు విధించారు. అప్పటి నుంచి బెల్టు షాపు యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చని... ఎక్సైజ్ అధికారులు ఇతరత్రా ఇబ్బందులు లేకుండా తాను చూసుకుంటానని గ్రామస్తుల సమక్షంలోనే భరోసా ఇచ్చేశారు. దాంతో అధిక మొత్తానికి వేలం పాడిన వ్యక్తి గ్రామంలో ఉన్న ఓ చిన్న పాకలో బెల్టు షాపు నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం నుంచి ఇది అనధికారికంగా తెరుచుకోనుంది.
ఆందోళనలో గ్రామస్తులు
స్థానిక ప్రజాప్రతినిధి నిర్వాకంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాన్ని తన సొంత జాగీరుగా భావించి తన కమీషన్ కక్కుర్తి కోసం బెల్టు షాపు చిచ్చు పెట్టడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని తన వద్ద ప్రస్తావించిన వారిపై ఆ ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన మాట ప్రకారమే అంతా జరుగుతుందని ఇష్టం లేని వాళ్లు గ్రామం విడిచిపోవాలని ఆయన హెచ్చరిస్తుండటం గమనార్హం. దాంతో గ్రామస్తులకు పాలు పోవడం లేదు. బెల్టు షాపు వల్ల కుటుంబాలలో తగాదాలు ఏర్పడతాయని, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ మహిళలు వాపోతున్నారు. గ్రామంలో బెల్ట్ షాపు లేకుండా ఎక్సైజ్ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సర్పంచ్ యాళ్ల సింహాచలం నాయుడు వద్ద ప్రస్తావించగా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. బెల్టు షాపులు ఎప్పుడూ ఉన్నవే కదా అని చెబుతూనే ఈ నెల 16న తాము తీర్థం నిర్వహణ కోసమే సమావేశమయ్యామని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించగా బెల్ట్ షాపు వేలంపాట విషయం తనకు తెలియదన్నారు.