
వంశధార గట్టు సమీపంలో బెవరేజ్ స్థలంలో సర్వే చేస్తున్న అధికారులు
టెక్కలి: మండలంలో వీఆర్‌కే పురం గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ (మద్యం నిల్వ కేంద్రం) గొడౌన్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, వంశధార అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఈ ఆక్రమణలను గుర్తించారు. ఇక్కడ కాలువలు నిర్మించకుండా గొడౌన్ ఏర్పాటుతో పొలాలకు ముంపు ప్రమాదం ఉందని, అలాగే వంశధార గట్టుపై అక్రమ తవ్వకాలు చేశారంటూ వీఆర్‌కే పురం, సీతాపురం గ్రామస్తులు ఇటీవల స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఐ హరి, సర్వేయర్లు సుభాష్, రమణమూర్తి, వంశధార ఏఈ యామిని తదితరులు ఫిర్యాదుదారులు, గ్రామస్తుల సమక్షంలో బెవరేజ్‌కు ఆనుకున్న వంశధార స్థలంలో కొలతలు వేశారు. చివరగా వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment