బెజవాడలో ముగ్గురి దారుణహత్య
పాత కక్షలతో తండ్రి, ఇద్దరు కొడుకులపై కాల్పులు
హత్య కేసులో కోర్టు వాయిదాకు కారులో వస్తుండగా ఘటన
జాతీయ రహదారిపైనే తెగబడిన దుండగులు
కిరాయి హంతకుల పనేనని పోలీసుల అనుమానం
విజయవాడ: ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకున్నాయి. గతంలో జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్రత్యర్థులు వారిని కిరాతకంగా హతమార్చా రు. పాత కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేం దుకు కారులో వస్తున్న ఇద్దరు నిందితులతో పాటు వారి తండ్రిని విజయవాడ సమీపంలో దారికాచి తుపాకులతో కాల్చి చంపారు. కారు డ్రైవరు పరారై పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో 5వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్యర్థుల కాల్పుల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన గందోడి(గంధం) నాగేశ్వరరావు(55), అతని కుమారులు పగిడి మారయ్య(36), గుంజుడు మారయ్య(32) మృతి చెందారు. వీరిపై 18 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగి పోలీసులు వివరించారు. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్యుడు భూతం దుర్గారావు హత్య కేసులో ఆయన బంధువు కూరపాటి నాగరాజుతోపాటు ఇతని సోదరి కుమారులైన ఇద్దరు మారయ్యలు కూడా నిందితులుగా ఉన్నారు. హత్య జరిగినప్పటి నుంచి దుర్గారావు, నాగరాజు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి.
ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితులంతా ముంబైలో తలదాచుకుంటున్నారు. అయితే ఏలూరు జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతుండటంతో వాయిదాలకు మాత్రం వచ్చి వెళుతున్నారు. బుధవారం కూడా వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మారయ్యలను వారి తండ్రి నాగేశ్వరరావు కలుసుకున్నారు. అక్కడి నుంచి అద్దె కారులో ఏలూరు బయల్దేరారు. పెదఅవుటుపల్లి సమీపంలోకి రాగానే వీరి కారును కొందరు దుండగులు తమ వాహనంతో ఢీకొట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ హతమార్చారు. ఘటనా స్థలాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. కేసు దర్యాప్తుకు, హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దుండగుల వేషధారణ, భాష, కాల్పులు జరిపిన తీరును బట్టి ముంబై లేదా హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు వాడిన వాహనాన్ని హనుమాన్‌జంక్షన్‌లో వదిలేసి వెళ్లడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి దుండగులు రాజమండ్రి వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. కాగా, దుండగులు వాడిన వాహనం దుర్గారావు సోదరుడు శ్రీనివాస్‌దని దర్యాప్తులో తేలింది.